Vijayawada: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
YS Jagan AT KanakaDurga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
KanakaDurga Temple at Vijayawada:
విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దుర్గ గుడి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్నిసీఎం జగన్ కు అందజేశారు.
అంతకుముందు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకోగానే ఆలయం అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దుర్గగుడి చిన్న రాజగోపురం వద్ద జగన్‌కు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు సీఎం జగన్ ను ఆశీర్వదించి, అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్ వస్తున్నారని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు సైతం భద్రతా కట్టుదిట్టం చేశారు.
అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం శుక్రవారం కావడంతో సరస్వతీ దేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో నేడు భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడ ఇంద్రకీలాదికి పోటెత్తారు.
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయం అభివృద్ధిపై సీఎం జగన్.. అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. దుర్గ గుడిలో కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం విజయవాడ నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ బయలుదేరనున్నారు.
వైభవంగా దసరా ఉత్సవాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అక్టోబర్ 15న ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 24 వరకూ కొనసాగనున్నాయి. రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం మహా చండీ దేవిగా దర్శనమిచ్చారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.