Purandeswari On Pawan : జనసేన మద్దతు మాకే, ఇతర పార్టీలతో పొత్తులు అధిష్ఠానం నిర్ణయిస్తుంది-పురందేశ్వరి
Purandeswari On Pawan : పవన్ పొత్తుల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తు్న్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ జనసేనతో పొత్తు కొనసాగుతోందన్నారు. భవిష్యత్తు పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.
Purandeswari On Pawan : పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీలో చర్చ మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు ఈ విషయంపై స్పందిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ-జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతాయని తెలిపారు. పొత్తు అంశంపై ఎలా వెళ్లాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆమె స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ పెరిగిందని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్దించారు. సమన్వయంతో రెండు పార్టీలు ముందుకు వెళుతున్నాయని స్పష్టం చేశారు. ఆత్మకూరు అభ్యర్ధిపై జనసేనతో చర్చించామని, బీజేపీ అభ్యర్ధికే జనసేన మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసే ప్రయాణం సాగిస్తాయని వివరించారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు
వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు చేశారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. ఆరోపించారు. ఈ పరిస్థితుల వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదని, యువతకు ఉపాధి లభించడం లేదన్నారు. ఏపీకి రాజధాని లేకుండా ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. ఏపీలో బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని పురందేశ్వరి కోరారు. రాష్ట్రానికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందన్నారు. జనసేనతో పొత్తు యథావిధిగా కొనసాగుతోందన్న ఆమె... రెండు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో పొత్తుపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురందేశ్వరి అన్నారు.
సోము వీర్రాజు ఏమన్నారంటే?
పవన్ పొత్తుల కామెంట్స్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయన్నారు. అయితే మెట్టు ఎవరు ఎక్కుతారో, ఎవరు దిగుతారో త్వరలోనే తెలుస్తుందన్నారు. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా రేపు(జూన్ 6న) విజయవాడ రానున్నారు. ఆయన పాల్గొనే సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లలో మొదటి దానిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రెండో ఆప్షన్ గురించి టీడీపీనే అడగాలన్నారు. పవన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. ఏపీలో రాజకీయ శూన్యత ఉందని, ఆత్మకూరు ఉపఎన్నిక ద్వారా దీనికి సమాధానం చెబుతామన్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడమే తమ లక్ష్యమని అన్నారు. వైసీపీ తీరును అందరూ తప్పుబడుతున్నారన్న ఆయన అందుకే తాము ఆత్మకూరు బరిలో దిగినట్టు తెలిపారు.