Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Ramana Dikshitulu : తిరుమల శ్రీవారి ఆలయ అధికారులపై రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆగమ శాస్త్రాన్ని పాటించడంలేదని ఆరోపించారు.
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. దేవాలయాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. ఏపీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు. ఆలయ అధికారులు వారి ప్రణాళికలు, వారి కల్పనలు అమలుచేస్తున్నారని విమర్శించారు. దేవాలయాల్లో ప్రముఖులకు, పారిశ్రామిక వేత్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని ట్వీట్ చేశారు. తిరుమలలో అధికారుల తీరుపైనా రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనికులు, వీఐపీ భక్తులకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సేవలో అధికారులు తరిస్తున్నారని ట్వీట్ చేశారు.
Agamas are totally ignored or altered by temple officials according to their own plans and fancies. Most importance is given to the rich devotees and self centered vips. Very pathetic in AP. https://t.co/dLtnm92hOG
— Ramana Dikshitulu (@DrDikshitulu) January 29, 2023
టీటీడీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు
తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తరచూ టీటీడీని టార్గెట్ చేస్తున్నారు. తిరుమలలో అర్చక వ్యవస్థపై ఇటీవల ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపింది. శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయని తెలిపారు. కానీ 30/87 చట్టంతో వీళ్లను తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై స్పందిస్తూ తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోందని రమణదీక్షితులు ట్వీట్ చేశారు. తిరుమలలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయని గతంలో ఓసారి ట్వీట్ చేశారు. తిరుమలలో అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం జగన్ ప్రకటన చేస్తారని అర్చకులు భావించారని ప్రస్తావించారు. అప్పట్లో ఆ ట్వీట్ దుమారం రేపడంతో దానిని డిలీట్ చేశారు.
వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు అమలు కోసం
టీటీడీ అర్చకులంతా వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును అమలు చేస్తామనే సీఎం జగన్ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ నిరాశే ఎదురయిందని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీలో ఉన్న బ్రాహ్మణ వ్యతిరేక శక్తుల వల్ల అర్చక వ్యవస్థ, ఆలయ ప్రతిష్ట కోసం వన్ మ్యాన్ కమిటీని అమలు చేసేలా ప్రకటన చేయాల్సి ఉందన్నారు.
ప్రధాన అర్చక పదవి కోసం
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఆలయ ప్రధానార్చకులుగా ఉన్న రమణదీక్షితులు పింక్ డైమండ్ ఆరోపణలు చేయడంతో.. ప్రభుత్వం ఆయనకు బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ అంశంపై ఆయన న్యాయపోరాటం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేత జగన్‌నూ కలిశారు. తమ ప్రభుత్వం వస్తే మళ్లీ ప్రధాన అర్చకులుగా నియమిస్తామనే భరోసా పొందారు. జగన్ సీఎం అయిన తర్వాత తిరిగి ప్రధాన అర్చక హోదా పదవి పొందాలని రమణదీక్షితులు ప్రయత్నిస్తున్నారు. అయితే చట్టపరమైన అడ్డంకులు ఉండటంతో సాధ్యం కాలేదు. చివరకు వన్ మ్యాన్ కమిటీ సిఫార్సుల ద్వారా మళ్లీ ప్రధాన అర్చకులుగా రావాలనుకుంటున్నారు. టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు సిఫార్సులు చేయాలని వన్ మ్యాన్ కమిటీకి ప్రభుత్వం చెప్పడంతో ఆ కమిటీ రిపోర్టుతో మళ్లీ పాత బాధ్యతలు వస్తాయని రమణదీక్షితులు ఆశిస్తున్నారు.