Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త, నేటి అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టోకెన్లు
Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి(అక్టోబర్ 31) అర్ధరాత్రి నుంచి తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు తిరిగి ప్రారంభించనున్నారు.
Tirumala :సామాన్య భక్తుల కోసం టైం స్లాట్ సర్వదర్శన విధానాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాలను ఏవి.ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు నేటి అర్ధరాత్రి నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రంలో మొత్తం ముప్పై కౌంటర్లల్లో టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు కల్పించామని చెప్పారు. ఇవాళ అర్ధరాత్రి టోకెన్లు పొందిన భక్తులకు స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం ఉంటుందన్నారు. టిక్కెట్లు పొందిన భక్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ స్వామి వారి దర్శనం అనుమతిస్తామని ఆయన వెల్లడించారు.
రోజుకు 25 వేల టికెట్లు
రేపు మంగళవారం కావడంతో కేవలం 15 వేల టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగిలిన రోజుల్లో 15 టోకెన్లను జారీ చేసేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వదర్శనం టోకెన్లను రోజు వారీగా పెంచుతామన్నారు. సర్వదర్శనం టోకెన్లు దొరకని భక్తులు నేరుగా వైకుంఠం-2కు చేరుకుని స్వామి వారి దర్శనం పొందే సౌలభ్యం కల్పించామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయంలో స్వామి దర్శనం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు.
ప్రయోగాత్మకంగా అమలు
టోకెన్ల జారీ ప్రక్రియ మంచి ఫలితాలు వస్తే భవిష్యత్తులో దీనిని అమలు చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ చేస్తామని తెలిపిన ఆయన, భక్తులకు టైం స్లాట్ వద్ద సులభతరం దర్శనం పొందే అవకాశం ఉందన్నారు. సర్వదర్శనం భక్తులు తిరుపతి, తిరుమలలో గదులు పొందవచ్చన్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శనం పొందిన భక్తులకు తిరుపతి మాధవంలో గదులు కేటాయించేందుకు ప్రయోగాత్మకంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలో కూడా గదులు కేటాయిస్తామని, దీని ద్వారా గదుల కేటాయింపులో ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు.
బ్రేక్ దర్శనాల్లో మార్పు
తిరుమలలో రద్దీకి అనుగుణంగా సర్వదర్శనం టోకెన్ల జారీ ఉంటుందని, టిక్కెట్లు లేని భక్తులు నేరుగా స్వామి వారిని వైకుంఠం 2 ద్వారా దర్శించుకోవచ్చని ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. వీఐపీ బ్రేక్ సమయంలో మార్పులు చేస్తున్నామన్నారు. సామాన్య భక్తుల సౌకర్యం కోసం ఈ మార్పు చేస్తున్నామని తెలిపారు. రాత్రి క్యూలైన్ లో వచ్చిన సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చేయాలని చైర్మన్ ఆదేశించారని, సాధ్యా సాధ్యాలను పరిశీలించి 8 గంటలకు మార్పు చేయాలని నివేదిక ఇస్తామన్నారు. ప్రయోగాత్మకంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో వసతి గదుల కేటాయింపులో ఒత్తిడి తగ్గనుందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం పొందిన భక్తులకు తిరుపతిలోని మాధవం వసతి గృహంలో వసతి ఏర్పాటు చేస్తామన్నారు.