AP Rains Latest News: మరో రెండు రోజులపాటు అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. కొనసాగుతోన్న రెడ్ అలర్ట్
Andhra Prdesh Rains News | ఏపీలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో మరో 2, 3 రోజుల వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం ఉదయం 7గంటలకే కాకినాడ(D) కాజులూరులో 100.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చొల్లంగిపేటలో 94.5 మి.మీ, కరపలో 75.5 మి.మీ, కాకినాడలో 66.7 మి.మీ చొప్పున 130చోట్ల 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, పిడుగుల కారణంగా ఎనిమిది మంది వరకు చనిపోయారని తెలుస్తోంది.
నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు
ఏపీలో సోమవారం, మంగవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.
సోమ,మంగవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి, విశాఖ,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు,
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 4, 2025
అనకాపల్లి,కాకినాడ,కోనసీమ,తూగో, పగో,ఏలూరు,కృష్ణా,నెల్లూరు, కర్నూలు,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో
అటు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
ఏపీలో భిన్నమైన వాతావరణం..
మరోవైపు రానున్న రెండు రోజులు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది. ఆదివారం నాడు గరిష్టంగా నంద్యాల జిల్లా గోనవరంలో 42.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా సోమశిలలో 42.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవైపు భారీ వర్షాలతో కొన్నిచోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరికొన్ని చోట్ల భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడితో పాటు తీవ్రమైన ఉక్కపోతతో ఏపీలో బుధవారం వరకు భిన్నమైన వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
ఏపీలో పలు జిల్లాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడం, కొన్ని జిల్లాల్లో పిడుగుల వర్ష సూచనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. హోం మంత్రి వంగపూడి అనిత సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ లో మాట్లాడి కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాలప పోకస్ చేయాలని సూచించారు. ఎక్కడా తాగునీటికి, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.
వర్షాల సమయంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్, చెట్ల కిందకుగానీ, శిథిలావస్థలో ఉన్నభవనాలు, బాగా తడిసిన గోడల వద్ద నిలబడకూడదని అవి కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలకు సూచించారు. చెట్ల కిందకు వెళితే పిడుగు పడే అవకాశం ఉంటుందని విపత్తుల సంస్థ వెల్లడించింది.






















