Breaking News: పొలం తగాదా విషయంలో ఘర్షణ.. కాల్పులు చేసిన మాజీ సైనికుడు.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 29న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
దిశ యాప్ SOS తో అలర్ట్ తో ఓ యువతి రక్షించారు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు. ఓ యువతి బంధువులతో కలిసి గుత్తికొండ బిలం చూసేందుకు వెళ్లింది. అయితే దర్శనం తర్వాత బంధువులు ఆటోలో బయలుదేరారు. యువతి స్కూటీపై వెనుక వస్తుంది. కొంత దూరం వచ్చాక భారీ వర్షం పడడంతో కొద్దిసేపు నిరీక్షించేందుకు చెట్టు కింద ఆగింది. జోరు వాన, చీకటి పడుతుండడంతో ముందుకు వెళ్లడం ఇబ్బందిగా భావించి ఆందోళన చెందింది. దిశ యాప్ SOS బటన్ నొక్కి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దిశ SOS కు వచ్చిన కాల్ పై స్పందించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్, ఎస్సై చరణ్ కి సమాచారం ఇచ్చారు. వెంటనే బాధితురాలిని రక్షింంచారు.
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు. వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్‍ను అరెస్ట్ చేసి ఏలూరు తీసుకువచ్చారు. నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్తుండగా చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల విధులకు చింతమనేని ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన దెందులూరు పోలీసులు.. ఈ మేరకు అరెస్టు చేశారు.
పొలం తగాదా విషయంలో ఘర్షణ.. కాల్పులు చేసిన మాజీ సైనికుడు.. ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో దారుణం జరిగింది. పొలం తగాదా విషయంలో ఘర్షణ తలెత్తి సాంబశివరావు అనే మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో.. శివ, బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మెుత్తం 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘర్షణలో ఇరుపక్షాల మధ్య తలెత్తిన వివాదమే ఘటనకు కారణమని తెలుస్తోంది. మాజీ సైనికుడు సాంబశివరావు తన వద్ద ఉన్న పిస్టోల్ తో దగ్గర నుంచి కాల్పులు జరపడంతో.. శివ, బాలకృష్ణలకు.. తల, శరీర భాగాల్లో నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి. మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఇద్దరు చనిపోయారు. ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తికి గాయాలు కాగా, మెుదట మాచర్లకు తరలించగా.. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.





















