Chandrababu Naidu: రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? చంద్రబాబు ఆవేదన, సీఎస్‌కు లేఖ
Human Trafficking: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు.
![Chandrababu Naidu: రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? చంద్రబాబు ఆవేదన, సీఎస్‌కు లేఖ TDP Chief Chandrababu Write Letter To CS Jawahar Reddy Over Cambodia Human Trafficking Chandrababu Naidu: రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? చంద్రబాబు ఆవేదన, సీఎస్‌కు లేఖ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/524fd3c938fbfe05e1f49d0bc0eb69901716905386123798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Naidu Letter To CS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మానవ అక్రమ రవాణా(Human Trafficking)పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణపై దృష్టి సారించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(CS Jawahar Reddy)కి లేఖ రాశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు ఉద్యోగాల కోసం కాంబోడియా వెళ్లి అక్కడ చిక్కుకుపోయారని, ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చీమకుట్టినట్లుగా కూడా లేదు
ఉద్యోగాల పేరుతో నకిలీ ఏజెన్సీలు యువతను మోసం చేశాయని, వందల మంది యువతను అక్రమ రవాణా చేశారని వాపోయారు. ఎన్‌ఐఏ విచారణలో అసలు విషయం బయటపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంత జరగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు. కంబోడియాలో చిక్కుకున్న యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను చంద్రబాబు కోరారు.
ఉద్యోగాల పేరుతో ఎర
విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి ఏపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణ జరుగుతోంది. నిరుద్యోగుల నుంచి రూ.లక్షన్నర వరకూ వసూలు చేసి వీరిని కంబోడియాకు అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడి ఏజెంట్‌కు రూ.80 వేలు, మిగిలినది హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా తీసుకుంటోంది. అక్కడ డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని చెప్పి ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఏకంగా 150 మందికి పైగా తరలించారనే ప్రచారం జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన దాదాపు 5 వేల మంది యువత వీరి చేతిలో చిక్కుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఇటీవల తెలిపారు. ఇక్కడ నుంచి తరలించిన వారితో ఫెడెక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయిస్తున్నారు.
స్కాం చేస్తే 600 డాలర్లు
కంబోడియాకు వెళ్లిన వారు అక్కడి ఒత్తిళ్లకు లొంగిపోయి స్కాములు చేస్తే 600 డాలర్లు ముట్టచెబుతున్నారు. మాటవినని వారిని చిత్రహింసలు పెడుతున్నారు. ఏపీలో శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, తుని, పలాస, కలకత్తా నుంచి నిరుద్యోగ యువత వీరి ఉచ్చులో చిక్కుకున్నారు. కంబోడియా మాఫియా నుంచి తప్పించుకుని వచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో దీనిపై విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్ దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ బాగోతాన్ని గుర్తించి, మానవ అక్రమ రవాణా కోణాన్ని వెలికి తీశారు. ఆ వెంటనే.. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి.. కంబోడియా కేటుగాళ్ల చేతుల్లో చిక్కుకున్న బాధితులకు విముక్తి కల్పించారు. సీపీ రవిశంకర్ అయ్యనార్ ప్రత్యేక చొరవతో ఎట్టకేలకు కంబోడియా బాధితులు విశాఖ చేరుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)