Stalin Letter To Jagan : ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్‌కు స్టాలిన్ లేఖ !
ఏపీ సీఎం జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. కుశస్థలి నదిపై నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల్ని తక్షణం నిలిపివేయాలన్నారు.
Stalin Letter To Jagan : ఏపీ, తమిళనాడు మధ్య కూడా జల వివాదాలు ప్రారంభమయ్యాయి. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో కుశస్థలి నదిపై ఏపీ నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల్ని తక్షణం నిలిపివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా, ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆనకట్టలు నిర్మించొద్దని లేఖలో సీఎం స్టాలిన్ కోరారు. లేకపోతే చెన్నై నగరానికి మంచినీటి సమస్య వస్తుందన్నారు. చిత్తూరు జిల్లాలోని కతరపల్లి, ముక్కలకండిగై గ్రామాల్లో కోశస్థలి నదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని.. ఈ రెండు ఆనకట్టల వల్ల భవిష్యత్తులో చెన్నై నగరానికి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని లేఖలో సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
ஆந்திர மாநிலத்தில் கொசஸ்தலை ஆற்றின் குறுக்கே இரு அணைகளை கட்டும் முயற்சியை ஆந்திர அரசு உடனடியாகக் கைவிட வேண்டும் என்று வலியுறுத்தி மாண்புமிகு ஆந்திர முதலமைச்சர் @ysjagan அவர்களுக்கு மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் கடிதம் எழுதியுள்ளார். pic.twitter.com/FKNxNtskXW
— CMOTamilNadu (@CMOTamilnadu) August 13, 2022
కోశస్థలి నది పరివాహక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో ఉంది. చెన్నై నగరానికి తాగు నీటి సరఫరా నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం ఈ నదిపై పూండీ (Poondi) రిజర్వాయర్‌ను నిర్మించింది. దీనికి ఎగువన ఎలాంటి ఆనకట్టలు నిర్మించినా పూండీ జలాశయానికి నీటి కొరత ఏర్పడుతుంది. ఆ ప్రభావం చెన్నై నగరంపై తీవ్రంగా ఉంటుంది. సరిహద్దులోని కొన్ని గ్రామాలకు సాగు నీటికి కూడా ఇబ్బంది తలెత్తుతుందిని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడు సరిహద్దులో నగరి వద్ద కుశస్థలి నదికి వరదలొస్తే నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టేందుకు గొలుసుకట్టు విధానంలో అనుసంధానమైన 20 చెరువులకు మళ్లించేలా ప్రాజెక్టుల్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. నగరి కుశస్థలి నది నుంచి నీటిని దారి మళ్లించి చెరువులకు సరఫరా చేసే 2017లో వచ్చిన వరదలకు ధ్వంసమైంది. అప్పటి నుంచి పనులు చేపట్టలేదు. విస్తారంగా వర్షాలు కురిసినా.. కుశస్థలి నది నుంచి నీరు మాత్రం చెరువులకు చేరక, వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. దీంతో నగరి ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కుశస్థలి నదికి వరద ప్రవహిస్తే సత్రవాడ గ్రామం నుంచి దారి మళ్లించి నగరి వరదను చెరువులకు చేర్చే కాలువల పూడికతీతకు రూ.3కోట్లను గతంలో ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. అయితే కుశస్థలికి వరద వచ్చినప్పుడు ఆ నీటిని చెరువులకు మళ్లించే ప్రాజెక్టులు చేపట్టే విషయంపై ఇంత వరకూ తమిళనాడు ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తాజాగా స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది.
ఏపీ - తమిళనాడు మధ్య ఇప్పటికే పాలార్ నదిపై ప్రాజెక్టుల వివాదంఉంది. పాలార్ నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న కుప్పం ప్రాజెక్టుపై చాలా కాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. ఇంకా పరిష్కారం కాలేదు. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టుల వివాదం ప్రారంభమయింది.