Hindupur News : ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వింత కష్టం, గుండు చేయించుకుంటే గుర్తుపట్టడంలేదు!
Hindupur News : దేవుడికి మొక్కు చెల్లించుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కొత్త చిక్కు వచ్చింది. గుండు చేయించుకున్నందుకు అడెంటెన్స్ వేసే ఫేషియల్ యాప్ అతడిని గుర్తుపట్టడంలేదు.
Hindupur News : ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వింత సమస్య వచ్చింది. దేవుడి మొక్కు తీర్చుకునేందుకు గుండు కొట్టించుకుంటే కష్టాలు వచ్చి పడ్డాయి. ఇదేం సమస్య అంటూ ఆ టీచర్ జుట్టు పట్టుకుంటున్నారు. సారీ గుండు గోక్కుంటున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని మేలాపురం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదినారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలో ఫేషియల్ యాప్ ద్వారా హాజరు వేయాలి. యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఆదినారాయణ తలపై జుట్టు ఉంది. మూతి మీద మీసం ఉంది. ఇటీవల ఆయన గుండు చేయించుకున్నారు. దీంతో జుట్టు, మీసం రెండూ లేవు. సోమవారం బడికి వెళ్లిన ఆదినారాయణ యాప్ ఓపెన్ చేసి ముఖం చూపిస్తే నువ్వు ఎవరో నాకు తెలియదు పో అన్నట్టుగా అటెండెన్స్ యాక్సెప్ట్ చేయలేదు. పలు విధాలుగా ప్రయత్నించినా అతడి హాజరుపడలేదు. దీంతో ఉపాధ్యాయుడు ఏం చేయాలో తెలియక డైలామాలో పడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న ఉపాధ్యాయులు.. దేవుడి మొక్కు తీర్చుకోవాలన్నా ముందుగా యాప్ అనుమతి తీసుకోవాలేమో అని సెటైర్లు వేస్తున్నారు. విగ్గు పెట్టుకుంటే సరి అని కొందరు చమత్కరిస్తున్నారు. తోటి ఉపాధ్యాయులు సెటైర్లు వేస్తున్నా... ఏం చేయాలో తెలియక గుండు మాస్టారు బుర్ర గోక్కుంటున్నాడు. చివరికి ఈ సమస్యను అనంతపురంలోని విద్యాశాఖ టెక్నికల్ అధికారికి తెలియజేసి పరిష్కరించాలని కోరారు.
తెలంగాణలో లోకేషన్ ఇష్యూ
ప్రభుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయుల అటెండెన్స్ పై వినూత్న రీతిలో డిజిటల్ పద్దతిని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రార్ పై సంతకం పెట్టడం కాకుండా మొబైల్ లోనే యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకునే వెసులు బాటు కల్పించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాప్ ద్వారా టీచర్లు అటెండెన్స్ ఫాలో అవుతున్నారు. ఉపాధ్యాయుల హాజరుపై పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గత 15 రోజులుగా జియో అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో సత్ఫలితాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
రెడ్ మార్క్ సమస్య
ఈ విధానంపై ఓ ఉపాధ్యాయుడ్ని ఏబీపీ దేశం వివరణ అడగగా... ఉదయం 9 గంటలకు స్కూల్ కి వెళ్లి యాప్ ఓపెన్ చేసి అటెండెన్స్ వేస్తున్నాం. కానీ మేము ఉన్న లోకేషన్ కు బదులు వేరే లోకేషన్ చూపిస్తోందని... స్కూల్ రాగానే ఇన్ పంచ టైప్ లో ఉదయం యాప్ లో ఫొటో దిగి అటెండెన్స్ వేసుకోవాలి. తర్వాత స్కూల్ ముగియగానే మరోసారి ఔట్ పంచ్ మాదిరి అటెండెన్స్ వేయాలి. రెండు సార్లు అటెండెన్స్ వేస్తున్నా గ్రీన్ మార్క్ రాకుండా రెడ్ మార్క్ వస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు అటెండెన్స్ పడిందా లేదా అన్న అయోమయంలో ఉంటున్నారు. అటెండెన్స్ పడితే గ్రీన్ మార్క్ చూపించాలి. కానీ రెడ్ మార్క్ చూపిస్తుండటంతో వారు ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1,196 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.... ఇందులో 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖలో 5,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని బడులకు సమయానికి వెళ్లకపోవడం, వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. వీటికి పరిష్కారంగా ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని పెంచి, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత 14న ఉపాధ్యాయులకు యాప్ ఇన్స్టాలేషన్, వినియోగంపై అవగాహన కల్పించారు. కొన్ని సందర్భాల్లో సమయానికి వచ్చినా ఆలస్యమైనట్లు చూపుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉదయం టైం ఇన్ అయినా సాయంత్రానికి టైంఅవుట్ చూయించట్లేదని మరికొందరు చెబుతున్నారు. ఆఫ్‌లైన్ లో సమర్థవంతంగా పనిచేయడం లేదని చెబుతున్నారు.