Weather Updates: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, మరో 3 గంటల్లో ఆ జిల్లాల్లో వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ
Southwest Monsoon: ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Southwest Monsoon: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. యానాంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పల్నాడు, పాడేరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడతాయని సైతం వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
Impact based forecast for district of Andhra Pradesh and Vijayawada city dated 18.06.2022. pic.twitter.com/MV9ZU1dWDT
— MC Amaravati (@AmaravatiMc) June 18, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రుతుపవనాల ప్రభావంతో నేడు సైతం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో గాలుల అసహజత ఉండటం వలన ఈ రోజు కూడా ఉదయం లేదా రాత్రివేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం జిల్లాల్లొ విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల వర్షపు నీరు అక్కడే నిలిచిపోయి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరో 3 గంటల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు.