Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తునకు బ్రేక్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Tirumala News: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తునకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో విచారణను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
SIT Investigation Stopped In Tirumala Laddu Row: తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సిట్ (SIT) దర్యాప్తునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి విచారణను కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే దాదాపు 4 రోజులుగా లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సోమవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.
సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
కాగా, లడ్డూ వివాదానికి సంబంధించి విచారణ సందర్భంగా బహిరంగ ప్రకటనలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచుతారని భావిస్తున్నామని తెలిపింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యినే వినియోగించారా.? లేదా.? అనే దానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌నే కొనసాగించాలా.? లేదా స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా.? అని కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్నీ గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, ఓ టీవీ ఎడిటర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సిట్ విచారణ సాగిందిలా
మరోవైపు, తిరుమల లడ్డూ వివాదంపై గత నాలుగు రోజులుగా సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని ఏర్పాటైన ఈ సిట్ మూడు రోజులుగా తిరుమలలోనే ఉంటూ దర్యాప్తు సాగిస్తోంది. మంగళవారం ఉదయాన్నే తిరుమల చేరుకున్న విచారణాధికారులు లడ్డూ తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. లడ్డూ తయారీ విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల దర్యాప్తులో భాగంగా టీటీడీ గోదాములు, పిండిమర, ల్యాబ్‌లను అధికారులు పరిశీలించారు. నెయ్యిని నిల్వ చేసే ట్యాంకర్లనూ సిట్ సిబ్బంది పరిశీలించారు. నెయ్యిని ఎలా వాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లనూ క్షుణ్ణంగా పరిశీలించింది. అన్ని కోణాల్లోనూ విచారించింది సిట్ బృందం. అయితే, సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తాత్కాలికంగా ఈ విచారణకు బ్రేక్ పడింది.
సీబీఐకు అప్పగించండి
మరోవైపు, తిరుపతి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని.. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని.. కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని యూనియన్ టెర్రిటరీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.
Also Read: APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ దసరా ఆఫర్- ఒకేసారి బుక్ చేసుకుంటే రాయితీ!