YS Sharmila : బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు - జగన్ కు షర్మిల సూటి ప్రశ్న
Andhra Pradesh : వివేకా హత్య కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని షర్మిల ప్రశ్నించారు
YS Sharmila On Jagan : ఇద్దరు వైసీపీ నేతలు కొట్టుకుని చంపుకున్న కేసులో ఢిల్లీలో ధర్నా చేసేందుకు వెళ్తున్న జగన్.. వైఎస్ వివేకా హత్య కేసులో ఎందుకు ధర్నా చేయలేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హత్యా రాజకీయాలు చేస్తున్నారని సొంత చెల్లెళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారంని మండిపడ్డారు. వివేకా హంతకులతో జగన్ మోహన్ రెడ్డి తిరుగుతున్నారని ఆరోపించారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని.. అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. వినుకొండ హత్య.. వ్యక్తిగతంగా జరిగిందన్నారు. అది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్నన్ని రోజులూ గుర్తు రాలేదా ?
అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. అదే సమయలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని.. వీటన్నిటిపై ఏనాడూ ధర్నా చేయలేదు ఎందుకని ప్రశ్నించారు. మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారాయ.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారని ఆరోపించారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదే 11 మంది, ఉన్న ఆ కొద్దిమందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొనరా .. ప్రజావ్యతిరేక బిల్లులపై పాలకపక్షంతో కొట్లాడే అవసరం మీకు లేదనుకుంటున్నారా అని జగన్ ను సూటిగా నిలదీశారు.
అసెంబ్లీని ఎగ్గొట్టడానికే ఢిల్లీ యాత్ర
ఓవైపు రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా మంది జనం వరదల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇల్లూ వాకిలీ నీట మునగడంతో దిక్కుతోచక రోదిస్తున్నారని షర్మిల గుర్తు చేశారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఎందుకు అనిపించడం లేదన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారంట.. సిగ్గుండాలి కదా అంటూ జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి !
రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని, లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ... చితికిపోయిన రైతుల మీద పిడుగు పడ్డట్టయిందని అన్నారు. గత ఐదేళ్లు జగన్ నిర్లక్ష్యంతో రైతులు చితికిపోయారన్నారు. రాజశేఖరరెడ్డి మొదలెట్టిన జలయజ్ఞాన్ని జగన్ విస్మరించారన్నారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేక గేట్లు ఊడి నదుల్లో తేలడం చూశామతి షర్మిల తెలిపారు. రైతులు దారుణంగా నష్టపోయారని, రుణమాఫీ చేసి ఆదుకోవాలని ప్రభుత్వం రైతులకు నష్టరిహారం అందించాలని షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.