MLA Kapu fire on CM Jagan : వైసీపీకి జగన్ సన్నిహిత ఎమ్మెల్యే రాజీనామా - నమ్మించి గొంతు కోశారని ఆగ్రహం
Raydurgam MLA : సీఎం జగన్ నమ్మించి గొంతు కోశారని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ప్రకటించారు.

Rayadurgam MLA Ramachandra Reddy : నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న కారణంగా టిక్కెట్లు నిరాకరిస్తున్న వారు సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాజాగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. గుడ్డిగా నమ్మితే.. నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. సర్వేల పేరుతో తనకు టిక్కెట్ లేకుండా చేశారని అన్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కలిసేందుకు జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఇంత కన్నా తనకు ఇంకే అవమానం ఉండదన్నారు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతాననని.. తాను రాయదుర్గం, తన భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు.
జగన్ మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీనీ, పదవిని వదులుకుని వచ్చాం. గతంలో మంత్రి పదవి ఇస్తా అన్నారు. పదవి ఇవ్వలేదు. సర్వే పేరుతో టికెట్ లేదని చెప్పారు. దరిద్రపు సర్వేలు చేశారు అని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నిజానికి ఆయన స్థానంలో కొత్త వారికి ఇస్తున్నట్లుగా ఇంకా సీఎం జగన్ ప్రకటించలేదు. కానీ క్యాంప్ ఆఫీసులో మూడో జాబితాపై కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనను క్యాంప్ ఆఫీసుకు పిలిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సర్వేలు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి.. టిక్కె్ట ఇవ్వడం లేదని తేల్చేశారు. కనీసం జగన్ ను కలిసేందుకు కూడా అంగీకరించకపోవడంతో ఆయన ఆగ్రహంగా బయటకు వచ్చేశారు.
కాపు రామచంద్రారెడ్డి సీఎం జగన్ తో మొదటి నుంచి ఉన్న నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే.. జగన్ వెంటనే కాపు రామచంద్రారెడ్డి నిలిచారు. రాజీనామాలు చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు నిరాశ ఎదురయింది. గాలి జనార్ధన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి బి.శ్రీరాములుకు కాపు రామచంద్రారెడ్డి వ్యాపార భాగస్వామిగా చెబుతారు. ఇటీవలి కాలంలో వారితో వ్యాపార వ్యవహారాల్లో వివాదాలు వచ్చాయని.. చెబుతున్నారు. ఇది కూడా కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్ నిరాకరించడానికి ఓ కారణం అని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య ఎప్పుడూ గట్టి పోటీ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం రాయదుర్గంలో టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు.
రాయదుర్గం నుంచి ఎవరికి టిక్కెట్ ఇస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అంతర్గతంగా ఇప్పటికే గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన మెట్టు గోవిందరెడ్డికి చాన్సిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లాలో అత్యధిక మందిని సీఎం జగన్ మారుస్తున్నారు. కల్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ కు స్థాన చలనం కల్పించారు. ఆమెను పెనుగొండకు మార్చారు. పెనుగొండకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణను అనంతపురం ఎంపీగా ఖరారు చేశారు. కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి బదులుగా మైనార్టీ నేతలకు టిక్కెట్ ఇచ్చారు. మూడో జాబితాలో అనంతపురం స్థానాలపై క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

