(Source: ECI/ABP News/ABP Majha)
చంద్రబాబును ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు, జీజీహెచ్ లో విఐపీ గది రెడీ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం జీజీహెచ్ నుంచి ఇద్దరు చర్మ సంబంధిత వైద్య నిపుణులు ఆయన్ను పరీక్షించి కొన్ని మందులు సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమండ్రి జైలులో చేరిన తర్వాత 5 కేజీలు తగ్గారని భార్య భువనేశ్వరి తెలిపారు. ఇటీవల డీహైడ్రేషన్, అలర్జీలతో బాధపడుతుండటతో కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జైలులో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు ఉందని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబును ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం జీజీహెచ్ నుంచి ఇద్దరు చర్మ సంబంధిత వైద్య నిపుణులు ఆయన్ను పరీక్షించి కొన్ని మందులు సూచించారు. దీంతో సీల్డ్ కవర్‌లో సమగ్ర నివేదిక జైలు ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దీంతో చంద్రబాబును ఇవాళ రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అత్యవసరం వీఐపీ గది సిద్ధం
రాజమండ్రి జీజీహెచ్‌లో ఉన్న వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా రెడీ చేయించారు. క్యాజువాలిటీ పక్కనున్న ఆ గది, మార్గం అంతా హడావుడిగా అర్ధరాత్రి క్లీన్ చేశారు. ఒకవేళ వైద్యుల సూచనలతో ఆయన్ను ఆసుపత్రికి తరలించాల్సి వస్తే, ముందు జాగ్రత్త చర్యగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ తో పాటు ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, మరో ఇద్దరు స్టాఫ్ నర్సులను విఐపీ గదికి కేటాయించారు. వారంతా శుక్రవారం అర్ధరాత్రి నుంచే సిద్ధంగా ఉన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. విఐపీ గదిలో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వాసుపత్రిలో వీఐపీ గదిని ఆగమేఘాలపై సిద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది.
శరీరంపై దద్దుర్లు
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ముగ్గురు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. తొలి నుంచీ వాడుతున్న మందులే వినియోగిస్తున్నారన్న ఆయన, రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవల డీహైడ్రేషన్‌కు గురైనట్లు చంద్రబాబు చెప్పడంతో వైద్యుల సూచన మేరకు ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని అందజేశామన్నారు. శరీరంపై దద్దుర్లు వచ్చినట్లు తెలపడంతో జీజీహెచ్ నుంచి ఇద్దరు వైద్య నిపుణులను పిలిపించి పరీక్షలు చేయించామన్నారు. వారు సూచించిన లోషన్లు, క్రీమ్‌లు అందజేశామని, చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వద్దని సూచించారు.
ఆరోగ్య పరీక్షలకు వ్యక్తిగత వైద్యులను అనుమతించే పరిస్థితి లేదని రవికిరణ్ స్పష్టం చేశారు. ఏమైనా సమస్య వస్తే వైద్యుల సూచన మేరకు ఆసుపత్రికి తరలిస్తామన్న ఆయన, జైలు నిబంధనల మేరకు ఏసీ సమకూర్చే అవకాశం లేదని, నిత్యం 8 ఫ్యాన్లు తిరుగుతున్నాయని డీఐజీ వెల్లడించారు. కలుషిత జలాల వల్లే చంద్రబాబుకు చర్మ సమస్య వచ్చిందన్న టీడీపీ ఆరోపణలను కొట్టిపారేశారు. అలాగైతే ఖైదీలందరికీ సమస్య వస్తుంది కదా అన్నారు. చంద్రబాబు కారాగారం లోపలకు వెళ్తున్న ఫొటోలు బయటకు రావడంపై విచారణ చేపడుతున్నామని వెల్లడించారు. ఓపెన్ ఎయిర్ జైల్ ప్రాంగణంలోకి డ్రోన్ వచ్చినట్లు గుర్తించామన్నారు. దీనిపై విచారణ జరిపినా ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.