(Source: ECI/ABP News/ABP Majha)
East Godavari News: హోంమంత్రి ప్రచారంలో గలాటా- మాజీ మంత్రి క్యాంపెయిన్‌లో కవ్వింపు చర్యలు - పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు
Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగుతున్నాయి. పోలింగ్‌కి ముందు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Andhra Pradesh News: పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రేరేపిత కవ్వింపు చర్యలు పెరిగిపోతున్నాయి. ఒకరి సభల్లోకి మరో పార్టీ శ్రేణులు వచ్చి గలాటా సృష్టిస్తున్నారు. ఏదో చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట జరిగింది. మంత్రి తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగింది. నల్లజర్లలో ప్రచారం చేస్తున్న తానేటి వనిత ప్రచారంపై ప్రత్యర్థులు దాడి చేశారు. అంతకు ముందు ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు హంగామా చేయడంతోనే గొడవ జరిగిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ద్విచక్రవాహనంలో వచ్చిన వైసీపీ శ్రేణులు... బైక్ సైలెన్సర్లు తీసేసి బీభత్సం సృష్టించారు. అక్కడే ఇరు వర్గాలకు వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ శ్రేణులు గాయపడ్డారు. దీన్ని మనసులో పెట్టుకున్న టీడీపీ కార్యకర్తలు హోంమంత్రి వనిత ప్రచార కార్యక్రమంలో ప్రతికారం తీర్చుకున్నారు. అక్కడ ఉన్న కుర్చీలను విరగ్గొట్టారు. అంతేకాదు పక్కనే ఉన్న డీజే వ్యాన్లతోపాటు ఇతర కారు అద్దాలు ధ్వంసం చేశారు.
గొడవ విషయాన్ని తెలుసుకున్నపోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవపై స్పందించి మంత్రి వనిత... టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతున్నామన్న ప్రస్ట్రేషన్‌లో ఇలా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు సత్యసాయి జిల్లాలో కూడా ఇలాంటి ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకుంది. రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల వేళ వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలకు దిగిందని మాజీ మంత్రి సునీత ఆరోపించారు. తాను ఎక్కడ ప్రచారానికి వెళ్లినా అక్కడ ఏదో గొడవ సృష్టిస్తున్నారన్నారు.
కనగానపల్లి మండలం రాంపురం గ్రామంలో పరిటాల సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. దీన్ని తట్టుకోలేని వైసీపీ లీడర్లు కవ్వింపు చర్యలకు దిగారని ఆరోపించారామె. మద్యం మత్తులో చొక్కలు విప్పి మిద్దెలు ఎక్కి రాళ్లు రువ్వారన్నారు. వెంటనే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు.
ఇలా రాళ్లు రువ్వడాన్ని అడ్డుకున్న కానిస్టేబుళ్లపై కూడా కొందరు వైసీపీ శ్రేణులు తిరగబడ్డారని సునీత పేర్కొన్నారు. చివరకు వారించేందుకు వచ్చిన ఎస్ఐపైకి కూడా దూసుకెళ్లారన్నారు. రాళ్ల దాడి ఆపకపోవడంతో స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారని వివరించారు. గ్రామాల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఓడిపోతామన్న భయంతో ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.