Rajahmundry: రాజమండ్రిలో ఉద్రిక్తత - కుర్చీలు, రాళ్లు, సీసాలతో దాడులు
వైఎస్ఆర్ సీపీ, విపక్షాల పోటాపోటీ కార్యక్రమాలు రాజమండ్రిలో రాజకీయ వేడిని సృష్టిస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం (అక్టోబరు 18) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ సీపీ నేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ ఓ సభ ఏర్పాటు చేసుకోగా, అదే సమయంలో అక్కడికి అమరావతి రైతుల మహాపాదయాత్ర చేరింది. వీరికి జనసేన, బీజేపీ మద్దతుగా నిలిచాయి. ఇదే సమయంలో మూడు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సభలోని కుర్చీలు విసురుకొన్నారు. అనంతరం స్థానిక ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తాము సభ ఏర్పాటు చేసుకుంటే బీజేపీ, జనసేన నేతలు రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసిరారని అన్నారు.
రాజమండ్రిలోని ఆజాద్ చౌక్ ప్రాంగణం రణరంగంగా మారింది. విపక్షాలు, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు స్థానికంగా తీవ్ర గందర గోళం సృష్టించాయి. ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్ ప్యాకెట్స్ చెప్పులతో కూడా విసిరి కొట్టుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ముందస్తుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లూ చేసి భారీ కేడ్ లు ఏర్పాటు చేసి కొంత వరకు ఘర్షణ వాతావరణాన్ని తప్పించారు.
వైఎస్ఆర్ సీపీ, విపక్షాల పోటాపోటీ కార్యక్రమాలు స్థానికంగా రాజకీయ వేడిని సృష్టిస్తున్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు నుంచి 9 గంటలకు ప్రారంభమై దేవీ చౌక్, ఆజాద్ ల మీదుగా సాగుతూ 10 గంటలకు ఆజాద్ చౌక్ వద్దకు చేరింది. అక్కడ అధికార వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాజమహేంద్రవరం అంతా అధికార వికేంద్రీకరణకు, మూడు రాజధానులకు మద్దతుగా నగరం అంతా భారీ హార్డింగ్ లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అదేవిధంగా పలుచోట్ల రైతుల మహా పాదయాత్రకు అనుకూలంగా స్వాగతం చెబుతూ టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి.
ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో తీవ్ర ఉత్కంఠతను రేపుతోంది. అధికార వైఎస్ఆర్ సీపీ కావాలనే ఇటువంటి సభలు ఏర్పాటు చేయడం ద్వారా పాదయాత్రకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తుందని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు మాత్రం తమ కార్యక్రమాల షెడ్యూల్‌లో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజమండ్రిలో ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఆజాద్ చౌక్ వద్ద వికేంద్రీకరణకు మద్దతుగా భారీ బహిరంగ సభ మొదలుకాగా పేపర్ మిల్లు నుంచి ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయింది.
జనసేన మద్దతు
అమరావతి రైతులు చేస్తున్నటువంటి మహా పాదయాత్రకు మద్దతుగా జనసేన పార్టీ రాజమండ్రి హుకుంపేటలో తమ మద్దతు తెలిపింది. పాదయాత్ర హుకుంపేటకు మధ్యాహ్నం చేరుకునే నాటికి అక్కడినుంచి జనసేన పార్టీ నాయకుడు నాగేంద్ర మనోహర్ తో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.