Rail Bus Service In Konaseema: కోనసీమ అందాలు చూపించే కాకినాడ- కోటిపల్లి "రైలు బస్సు"- రీ స్టార్ట్ చేయాలని కోరుతున్న ప్రజలు
Andhra Pradesh Latest News: కాకినాడ కోటిపల్లి రైల్ బస్ మళ్ళీ పట్టాలెక్కేది ఎప్పుడు? కరోనా టైంలో ఆపేసిన ఈ రవాణా వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించాలని స్థానికులు కోరుతున్నారు.
Do You Know Kotipalli - Kakinada Town Rail Bus Service In Konaseema: దేశంలోని అన్ని రాష్ట్రాలు టూరిజం పరంగా ఎలాంటి క్రొత్త కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుంటే ఏపీలో మాత్రం చేతిలో ఉన్న ఒక గొప్ప అవకాశాన్ని రైల్వే పక్కన పెట్టేస్తుంది. అదే " రైలు బస్సు". రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా లేని అరుదైన " రైలు బస్సు" నిన్న మొన్నటి వరకూ ఏపీలో తిరిగేది. అయితే కరోనా పేరు చెప్పి దానిని రద్దు చేసింది డిపార్ట్మెంట్.
కాకినాడ - కోటిపల్లి మధ్య తిరిగే "రైల్ బస్సు "
కోనసీమకు రైలు తేవాలని దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చేసిన కృషి ఫలితంగా కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ రైల్వే లైన్ ఏర్పడింది. అక్కడి నుంచి గోదావరి మీదుగా బ్రిడ్జి నిర్మించి నర్సాపూర్‌కు లింక్ ఏర్పాటు చేస్తే కోనసీమకు రైల్వే లైన్ వచ్చేసినట్టే. అయితే ఈ లోపే ప్రమాదవశాత్తు బాలయ్య మరణించారు.
దీంతో కోటిపల్లి- నరసాపురం పనులు నెమ్మదించాయి. ఆ టైం గ్యాప్ లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు ఆల్రెడీ ఏర్పడి ఉన్న రైల్వే లైన్ పై రైలు బస్సు తిరిగేది. 77271 నెంబర్ గల ఈ రైలు బస్సు కాకినాడలో ఉదయం 9:30కు మొదలై కొవ్వాడ, వాకాడ, వేలంగి, ద్రాక్షారామం, రామచంద్రపురం మీదుగా ప్రయాణించి ఉదయం 11:30కు కోటిపల్లి చేరుకునేది. కాకినాడ నుంచి కోటిపల్లి మధ్యలో 8 స్టేషన్‌లలో ఆగేది. ఈ ట్రైన్ ప్రయాణ దూరం 45 కిలోమీటర్లు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు బస్సు (77272) 12 గంటలకు కోటిపల్లిలో బయలుదేరి రెండు గంటలకు కాకినాడ చేరుకునేది.
బస్సు లాంటి రైలు
అసలు ఈ "రైలు బస్సు" చూడడానికే చాలా ముద్దుగా ఉండేది. దీనికి టికెట్లు రైలు బస్సు లోపలే ఇచ్చేవారు. దీన్ని నడిపే డ్రైవరే టికెట్లు ఇచ్చుకోవాలి. అలాగే తనే దిగి వెళ్లి రైలు గేటు వేసుకుని రైలు బస్సు ముందుకు వెళ్లిన తర్వాత వెనక్కి వచ్చి గేటు తెరవాలి. ఇలా పచ్చని పొలాల మధ్య కోనసీమ అందాలు చూస్తూ రైలు బస్సులో ప్రయాణించడం భలే ఉండేది. అప్పట్లో కాకినాడ నుంచి కోటిపల్లికి బస్సు చార్జి 30 రూపాయలు. రైలు బస్సు ఛార్చ్ మాత్రం పది రూపాయలే. పైగా అప్పట్లో రోడ్లు పెద్దగా బాగుండేవి కావు. దానితో చిరు వ్యాపారులు రైలు బస్సును ఆశ్రయించేవారు. రాను రాను రైలు బస్సు కెపాసిటీ చిన్నది కావడం, వచ్చే ఆదాయం తక్కువ కావడంతో దక్షిణ మధ్య రైల్వే "రైలు బస్సు" ను పలమార్లు రద్దు చేసింది. ఈ లోపు కరోనా రావడంతో "రైలు బస్సు " పూర్తిగా రద్దు అయ్యింది.
ఖర్చులు రావడం లేదు : రైల్వే
" రైలు బస్సు"ను మళ్ళీ ప్రారంభించాలని ఉన్నా దానిపై వచ్చే ఆదాయం రైలు బస్సు నడపడానికయ్యే ఖర్చు కంటే తక్కువ వస్తుందని అందుకే దానిని రివైవ్ చేయడం లేదని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌చెందిన నుస్రత్ మందృపకర్ తెలిపారు.
జనసేన తలుచుకుంటే సాధ్యమే!
ప్రస్తుతం కాకినాడ ఎంపీ ఉదయ్, ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ, కాకినాడ పక్కనే ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే జనసేన చేతిలోనే ఉన్నాయి. కేంద్రంలో జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలుకుబడి చాలా ఎక్కువే. కనుక ఒక్కసారి జనసేన దృష్టి పెడితే కాకినాడ- కోటిపల్లి "రైలు బస్సు" మళ్ళీ పట్టాలెక్కుతుంది. కరోనా తర్వాత ఉద్ధృతమైన సోషల్ మీడియా ప్రభంజనం అంతకు ముందు లేదు. అందువల్ల "రైలు బస్సు" గోదావరి జిల్లాల బయట పెద్దగా పాపులర్ కాలేదు. ఇప్పుడు దాన్నేమళ్ళీ స్టార్ట్ చేసి టూరిజం పరంగా పబ్లిసిటీ చేస్తే అటు రైల్వేకు ఆదాయం ఇటు రాష్ట్రానికి పర్యాటకం పరంగా మంచి పేరు రావడం ఖాయం.