Coconut Price Hike: కోనసీమ రైతులకు కాసుల పంట, రికార్డు స్థాయిలో పెరిగిన కొబ్బరి ధరలు!
Coconut Price Hike: కోనసీమ కొబ్బరికి డిమాండ్ బాగా పెరగడంతో ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకి కొబ్బరి రైతుల ముఖాల్లో ఆనందాలను పూయిస్తున్నాయి.

Coconut Price Hike: కోనసీమను చూస్తే అంతా మరో కేరళ అంటుంటారు. పైనుంచి చూస్తే నేలంతా పచ్చని తీవాచీ పరిచినట్లు కనిపించే అంతగా దట్టంగా కొబ్బరి చెట్లుతో నిండి ఉంటుంది కోనసీమ ప్రాంతం. అందుకే ఇక్కడ ఒక నానుడి కూడా ఉంది. కొబ్బరి చెట్టు ఇంటికి పెద్దకొడుకుగా చెబుతారు. అటువంటి కొబ్బరి అంటే ఇక్కడి ప్రజలకు అంతే మక్కువ. చిన్న జాగా ఖాళీగా కనిపిస్తే వెంటనే అక్కడ కొబ్బరి చెట్లు నాటుతారు. అందుకే ఇంటి ముందు పెరట్లోనూ కొబ్బరి చెట్లుతో నిండి ఉంటుంది. ప్రతీ రైతుకు ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న కొబ్బరి పంట కొంత కాలంగా నష్టాల్లో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. కొబ్బరి చెట్లపై తెగుళ్ల దాడి.. పెరిగిన నివాస ప్రాంతాలు, విపరీతంగా పెరిగిపోయిన ఆక్వా చెరువులు పుణ్యమా అని కొబ్బరి ఫలసాయం బాగా దిగుబడి పడిపోయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థతి తలెత్తింది. అయితే గత రెండు నెలలుగా కొబ్బరి ధర రికార్డు స్థాయిలో అమాంతంగా పెరగడం కోనసీమ కొబ్బరి రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది..
ధరల పెరుగుదలకు కారణం ఇదేనా...
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతులకు 2025 సంవత్సరం ఆరంభం నుంచి ఆర్థికంగా లాభదాయకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. కొబ్బరి ఉద్యాన పంటలు పండించే రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గడంతో కోనసీమ కొబ్బరికి జాతీయ మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో కొబ్బరి ధరలు రికార్డు స్థాయికి చేరాయని రైతులు చెబుతున్నారు.. పొరుగు రాష్ట్రాలలో ఎగుమతులు ఎక్కువగా ఉన్న సమయంలో ధరలు పతనమయ్యి ఇక్కడి రైతులు తీవ్ర నిరాశకు గురైన పరిస్థితి కనిపించింది. ఈక్రమంలో కొబ్బరికి గిట్టుబాటు ధర కల్పించాలని దానికోసం కోనసీమలో నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరిగింది. దీనిపై అమలాపురం ఎంపీ గంటి హరీష్‌కు పలువురు రైతులు విజ్ఞప్తి కూడా చేశారు.
ప్రణాళికతో కురిడీగా మార్చిన రైతులు..
అల్లవరం మండలానికి చెందిన కొల్లు ఆదినారాయణ అనే కొబ్బరి రైతు తాను కొనుగోలు చేసిన కొబ్బరిని సరైన ధర లేక కురిడీగా మార్చేందుకు సిద్ధపడి 3 లక్షల కొబ్బరిని అటక మీద ఎక్కించి ఆరు నెలలు నిల్వచేశాడు. ఇప్పడు కురిడీకి భారీ రేటు లభిస్తుండడంతో వాటిని విక్రయించాడు. దీంతో భారీగా లాభం సమకూరింది. 2024లో కొబ్బరి ధర పతనం అయినప్పడు ఇలా ప్లాన్డ్‌గా చేసిన రైతులుంతా ఇప్పడు కొబ్బరి ధర భారీగా పెరగడంతో భారీగా లాభ పడుతున్నారు. ఇంకా విశేషం ఏంటంటే కోనసీమ నుంచే ఇప్పడు కురిడీ కొబ్బరి భారీగా ఎగుమతులు అవుతున్నాయని కొబ్బరి మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
భారీగా పెరిగిన కొబ్బరి ధరలు..
ఉద్యాన పంటల ఎగుమతులకు పెట్టింది అంబాజీపేట మార్కెట్.. ఇక్కడ నుంచి భారీ స్థాయిలో కొబ్బరి ధరల గురించి స్థానిక కొబ్బరి రైతు, కొబ్బరి రైతు సంఘాల అధ్యక్షుడు ముత్యాల జమీలు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి ధరల పెరుగుదల ముందు ఎప్పడూ చూడలేదని అంటున్నారాయన.
గతేడాది (2024) 1,000 కొబ్బరి కాయల ధర రూ. 9,000 ఉండగా, 2025లో ఇది రూ. 19,000 నుంచి రూ. 24,000 వరకు పెరిగింది. కొన్ని లంక గ్రామాల్లో కొబ్బరి ధర రూ. 24,000 వరకు చేరినట్లు సమాచారం.
కురిడీ కొబ్బరి కాయలు (గండేరా రకం) క్వింటాల్‌కు రూ. 29,000, గటగటా రకం రూ. 28,000 వరకు పలికాయి.
కొత్త కొబ్బరి క్వింటాల్ ధర రూ. 24,000గా నమోదైంది, ఇది 60 ఏళ్లలో రికార్డు స్థాయిగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణాలివి..
పొరుగు రాష్ట్రాల్లో వర్షపాతం లేమి, ఇతర సమస్యల వల్ల కొబ్బరి ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీంతో కోనసీమ కొబ్బరికి డిమాండ్ పెరిగిందంటున్నారు. ఇదిలా ఉంటే ఆధ్యాత్మిక అవసరాలకు కూడా కొబ్బరికి బాగా డిమాండ్ ఉండడంతో ఈ డిమాండ్‌కు మరో కారణం..
శ్రావణమాసం, వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీక మాసం వంటి పండుగలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల కారణంగా కొబ్బరికి డిమాండ్ మరింత పెరిగింది. కొబ్బరి చిప్పలకు కూడా మార్కెట్‌లో గిరాకీ ఏర్పడింది, ఇది ధరల పెరుగుదలకు దోహదపడిందంటున్నారు.





















