Tiger Triumph - 2025: కాకినాడ తీరంలో భారత్ అమెరికా యుద్ధ విన్యాసాలు- ఆ రోడ్డు వైపు రాకపోకలు పూర్తిగా నిషేదం!
Kakinada Latest News: కాకినాడ తీరంలో భారత్ అమెరికా యద్ధ విన్యాసాలు 13 వరకు జరగనున్నాయి. దీంతో తీరం వెంబడి సందర్శకుల రాకపై నిషేధం విధించారు.

Tiger Triumph- 2025: కాకినాడ తీరంలో యుద్ధ వాతవారణం కనిపిస్తోంది. ఆకాశంలో గిరగిరా తిరిగే జెట్ విమానాలు, మిలటరీ చాపర్‌లు, సముద్రంలో మోహరించిన యుద్ధనౌకలు.. తీరం వెంబడి మోహరించిన యుద్ధట్యాంకులు, జెమినీ బోట్లతో కాకినాడ సాగర తీరంలో ఒక యుద్ధరంగంలా కనిపిస్తోంది. దీనికి అంతటికి కారణం కాకినాడ సాగర తీరంలో నిర్వహిస్తోన్న టైగర్ ట్రియంప్ - 2025 పేరుతో భారత్, అమెరిగా యుద్ధ విన్యాసాలే కారణం. కాకినాడ నుంచి ఉప్పాడ వైపుగా ఉన్న బీచ్ రోడ్డును వారం రోజులపాటు పూర్తిగా మూసివేశారు. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి నిషేధాజ్ఞలు విధించారు.
కాకినాడ రూరల్ మండలం సముద్ర తీరంలోని నేవల్ ఎన్ క్లేవ్ కు సంబంధించి నిర్వహించనున్న సైనిక విన్యాసాలు 8న ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు ఈ విన్యాసాలు సాగనున్నాయి. సాగర తీరంలోకి ఎవ్వరినీ అనుమతించడంలేదు. పూర్తిగా నిషేదాజ్ఞలు విధించి ఈ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ తీరంలో మిలటరీ హెలీక్యాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. సాగర తీరం వెంబడి ఈ చాపర్లు గిర్రున తిరుగుతుండడంతో ఈ యుద్ధ విన్యాసాలు గురించి సమాచారం తెలియని ప్రజలు మాత్రం కాకినాడ సముద్రతీరంలో ఏం జరుగుతుందంటూ చర్చించుకుంటున్నారు.
ఈ యుద్ధవిన్యాసాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్.. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విన్యాసాలు జరిగే ప్రాంతంలో స్టేట్ హైవే బ్లాకింగ్, బారికేడింగ్, ట్రాఫిక్ మళ్లింపు, క్రౌడ్ నియంత్రణ, సైనిక విన్యాసాలు దృష్యా ప్రవేశ అనుమతి ఉండని నో పబ్లిక్ జోన్ ప్రాంతాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ సైనిక దళాల భాగస్వామ్యంతో భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రియంఫ్-25 కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు.
భారత్, అమెరికా వాయుసేనల సంయుక్త ఆధ్వర్యంలో..
భారత్, అమెరికా వాయుసేనల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ వరకూ టైగర్ ట్రియంఫ్-2025 పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలను విశాఖపట్నం, కాకినాడ తీరాలలో నిర్వహిస్తుండగా ఇందులో భాగంగా ఈ నెల 08 నుంచి 13వ తేదీ వరకూ కాకినాడ తీరంలోని నేవల్ ఎన్ క్లేవ్ లో యాంఫీబియస్ విన్యాసాలు జరుగనున్నాయి. ఈ సైనిక విన్యాసాలు సక్రమంగా జరిగేందుకు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సైనిక విన్యాసాలు జరిగే కాంపింగ్ సైట్‌లో చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన సిబ్బందిని నియమించారు.
కాకినాడ తీరంలో మోహరించిన యుద్ధట్యాంకర్లు..
కాకినాడ తీరంలో ప్రస్తుతం యుద్ధం జరుగుతోందన్న పరిస్థతి కనిపిస్తోంది.. తీరం వెంబడి సైనికులు గుడారాలు వేసుకుని పహరాలు కాస్తున్నారు.. యుద్ధట్యాంకర్లుసహా ఇతర వెసల్స్ ను తీరం వెంబడి మోహరించారు. జెట్ విమానాల రీసౌండ్ వస్తోంది. ఇదిలా ఉంటే సందర్శకులు భ్రదతా దృష్ట్యా మాత్రం తీరానికి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో బీచ్‌లో సరదాగా గడపాలనుకుంటున్నవారు మాత్రం తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని పార్కు, శిల్పారామంలోకి కూడా సందర్శకుల అనుమతిని తాత్కాలికంగా నిషేధించారు.





















