Godavari Flood: గోదావరి వరద గర్జన- భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో ప్రవాహం- కోనసీమ అప్రమత్తం
Godavari Flood: గోదావరి భద్రాచలం వద్ద 52.50 అడుగులకు మించి ప్రవహిస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద 12.40 అడుగుల నీటిమట్టం చేరింది.

Godavari Flood: గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. మొన్నటి వరకు పెరుగుతూ తగ్గుతూ వచ్చిన వరద అమాంతంగా వెల్లువెత్తింది. మహారాష్ట్ర తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి బాగా పెరగ్గా భద్రాచలం వద్ద 52.50 అడుగుల ప్రమాదకర స్థాయికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇదే క్రమంలో ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది.. దీంతో ధవళేశ్వరం వద్ద 12.40 అడుగుల నీటిమట్టం చేరింది. దీంతో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. సముద్రంలోకి 10.83 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదులుతుండడంతో దిగువనున్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం..
ధవళేశ్వరం నుంచి పదిలక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతుండడంతో ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లోకి వరద పోటెత్తుతోంది.. ముఖ్యంగా గౌతమి నదీపాయకు ఆనుకుని ఉన్న కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని పలు లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వశిష్టకు ఆనుకుని ఉన్న పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లోని లంక గ్రామాలతోపాటు నదీపరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశాలమేరకు ఇప్పటికే వరద ప్రభావిత గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ముంపుకు గురయ్యే గ్రామాలను గుర్తించి అక్కడ పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా - పి.గన్నవరం మండలాలను కలిపే కనకాయిలంక కాజ్‌వే నీట మునిగింది. రాకపోకలు అన్నీ మర పడవల్లోనే సాగిస్తున్నారు. గంటిపెదపూడి, బూరుగులంక, అరిగెలవారిపాలెం, ఊడిమూడిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయినవిల్లి మండల పరిధిలోని లంక ప్రాంతాలకు వెళ్లే ఎదురుబిడియం కాజ్‌వేపై వరద నీరు చేరింది.. అయినవిల్లి మండలం అద్దంకివారి లంక, వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక, పల్లపులంక ప్రాంతాల్లో కూడా వరద ముంపుకు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
పడవ దాటింపులపై నిషేదాజ్ఞలు..
గోదావరికి వరదల నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని పంటు, పడవ దాటింపులపై నిషేదాజ్ఞలు జారీ చేశారు అధికారులు. ఇప్పటికే ముక్తేశ్వరం - కోటిపల్లి రేవులో పంటు దాటింపులను నిలిపివేశారు. ఇక ఓడలరేవు- కరవాక, బెండమూర్లంక - గోగన్నమఠం తదితర రేవుల్లో పడవ దాటింపులను నిలిపివేశారు. వశిష్ట నదీపాయకు వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో నర్సాపురం - సఖినేటపల్లి రేవులో పంటు దాటింపులను నిలిపివేసేందుకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు..





















