TDP Protest: ఎన్నాళ్లీ ‘న్యాయానికి సంకెళ్లు’ అంటూ కదంతొక్కిన టీడీపీ - నిరసనలో పాల్గొన్న చంద్రబాబు ఫ్యామిలీ
TDP Protest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆదివారం టీడీపీ ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమం నిర్వహించింది. రాజమండ్రిలో నారా భువనేశ్వరి మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.
TDP Protest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు టీడీపీ ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇప్పటికే సత్యమేవ జయతే, కాంతితో క్రాంతి చేపట్టిన టీడీపీ ఈ ఆదివారం న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలోని విద్యానగర్‌లోని క్యాంప్ సైట్ వద్ద నారా భువనేశ్వరి మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. భువనేశ్వరి తన చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. ‘బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు, బాబు కోసం నేను సైతం, వీ వాంట్ జస్టిస్, అధర్మం నశించాలి, అన్యాయం నశించాలి’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో లోకేష్ దంపతుల నిరసన
అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మిణి హైదరాబాద్‌లోని వారి నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు అంటూ నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.
టీడీపీ శ్రేణుల నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఆ పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి చేతులకు తాళ్లు, ఖర్చీఫులు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడును కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి 38 రోజులు అవుతున్నా కేసులో ఆధారాలు చూపించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కు అధికార వైసీపీ తగిన ప్రతిఫలం చెల్లించుకుంటుందన్నారు.
గతవారం కాంతితో క్రాంతి
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ ప్రతి వారం ఒక్కో కార్యక్రమంతో ముందుకు వస్తోంది. ఈ ఆదివారం న్యాయానికి సంకెళ్లు నిర్వహించగా గత శనివారం కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు, మద్దతుదారులు భారీగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ఇళ్లలోని లైట్లు ఆఫ్ చేశారు. అనంతరం ఇంటి బయటకు వచ్చి దీపాలు, కొవ్వొత్తులు తెలిగించి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో టీడీపీ శ్రేణలు, అభిమానులు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొన్నారు. ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించారు. అలాగే రోడ్లపై ఉన్నవారు వాహనాల లైట్లు బ్లింగ్ చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఢిల్లీలో టీడీపీ నేతలతో కలిసి నారా లోకేష్ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైసీపీ సర్కార్ తీరుపై నిరసన తెలిపారు. సేవ్ ఏపీ.. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా మద్దతు ప్రకటించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నేతలందరూ నినదించారు. అటు రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి దీపాలు వెలిగించారు. ఎన్టీఆర్ భవన్ వద్ద ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు, టీడీపీ నేతలు దీపాలు వెలిగించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్, బెంగళూరులో కూడా టీడీపీ అభిమానులు దీపాలు వెలిగించి బాబుకు మద్దతుగా నిలిచారు. ఈనెల 2న గాంధీ జయంతి రోజున టీడీపీ నేతలు సత్యమేవ జయతే పేరుతో దీక్షలకు కూర్చున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో దీక్ష చేయగా రాజమండ్రి జైలులో చంద్రబాబు, బయట నారా భువనేశ్వరి దీక్ష చేశారు.