Student Suicide Attempt: కోనసీమలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, గంటకు పైగా టెన్షన్ టెన్షన్ - చివరికి ఏమైందంటే !
Student Suicide Attempt: విద్యార్థిని ఉన్నట్టుండి స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో కలకలం రేపింది.
క్లాస్ రూమ్‌లో తోటి విద్యార్థులతో కలిసి పాఠాలు వింటున్న విద్యార్థిని ఉన్నట్టుండి ఆత్మహత్యయత్నం చేసింది. స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకేందుకు చూడగా.. టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చివరికి విద్యార్థినిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో సోమవారం జరిగింది. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై స్థానికులు, పాఠశాల యాజమాన్యం, రూరల్ సీఐ పెద్దిరెడ్డి శివ గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
స్కూల్ బిల్డింగ్ ఎక్కి విద్యార్థిని హల్‌చల్
స్థానిక విజయలక్ష్మి నగర్ లో ఉన్న శశి పాఠశాలలో నూనె హేమ అశ్రిత అనే విద్యార్థిని 9వ తరగతి చదువుకుంటుంది. పరీక్షల్లో తనకు మార్కులు తక్కువ వచ్చాయనే మనోవేదనతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో తరగతి గదిలో నుండి హఠాత్తుగా లేచి వెళ్లిపోయి ఐదంతస్తుల స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కేసింది. అక్కడి నుండి భవనం మీద ఉండే పిట్టగోడ పైకి ఎక్కి కిందకి దూకడానికి సిద్ధపడింది. స్కూల్ మేనేజ్‌మెంట్ నుంచి సమాచారం అందుకున్న రూరల్ సీఐ పెద్దిరెడ్డి శివ గణేష్ హుటాహుటిన రూరల్ ఎస్సై బల్ల శివకృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి శశి పాఠశాలకు చేరుకున్నారు. అగ్నిమాపక వాహనంతో పాటు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని అప్రమత్తమయ్యారు. పై నుంచి దూకేస్తానని విద్యార్ధిని హేమ అశ్రిత హెచ్చరిస్తోంది.
రూరల్ సీఐ శివ గణేష్, రూరల్ ఎస్సై శివకృష్ణలు నెమ్మదిగా స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్లారు. ఓ పక్క భవనం కింది భాగంలో స్థానికులు, పాఠశాల యాజమాన్యం పెద్ద సైజులో క్లాత్‌ను తెప్పించి, దాన్ని చాపలా పరిచి అందరూ గట్టిగా పట్టుకొని నిల్చున్నారు. మరోవైపు విద్యార్ధిని కింద ఏర్పాటుచేసిన పరదా వైపు కాకుండా వేరే వైపు వెళ్తూ హడలెత్తించింది. ఈ ఆందోళనకర దృశ్యాలు పరిశీలిస్తున్న పాఠశాల యాజమాన్యం, స్థానికులు ప్రమాదంలో పడి పోతుందేమోనని కంగారు పడకు తల్లీ అంటూ కేకలు వేయసాగారు.
దగ్గరికి వస్తే దూకేస్తానంటూ వార్నింగ్.. !
ఓ పక్క నుండి పైన ఉన్న సీఐ, ఎస్సై లు కూడా విద్యార్థిని మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈలోగా ఉన్నట్టుండి ఆశ్రిత నన్ను పట్టుకోవాలని చూస్తే దూకేస్తానని బెదిరిస్తూ పిట్ట గోడ కిందకు కాళ్లు వదిలేసి గోడ పట్టుకుని కూర్చుంది. ఈ క్రమంలో ఆశ్రితకు తల తిరుగుతున్నట్టుగా ఉండడంతో తలను పట్టుకొని కూర్చుంటుండగా సీఐ గణేష్, ఎస్సై శివ కృష్ణలు ఎంతో చాకచక్యంగా రెండు చేతులూ పట్టుకుని రెప్ప పాటులో పైకి లాగేసారు. దాంతో కింద ఉన్నవారంతా ఆనందోత్సాహాలతో కేకలు వేస్తూ చప్పట్లు చరుస్తూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థిని అశ్రిత నిండు ప్రాణాలు కాపాడిన సీఐ శివ గణేష్, ఎస్సై శివకృష్ణలు ఆ సమయంలో వచ్చి కాపాడారని ప్రజలు జేజేలు పలికారు. పోలీసులు సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు పనిచేస్తారనే మాటను అక్షరాలా నెరవేర్చి విద్యార్థిని ప్రాణాలు కాపాడారని మండపేట పోలీసులను స్థానికులు ప్రశంసించారు. వీరిద్దరి చొరవతో నిండు ప్రాణాలు నిలవడంతో విద్యార్ధిని తల్లి దండ్రుల కళ్లల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. విద్యార్ధినిని రక్షించడానికి పోలీసులు చూపిన తెగువ నెట్టింట వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు వీరిద్దరినీ ప్రత్యేకంగా అభినందించారు.
వేధింపులే కారణమా..
ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు అధికంగా విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ వేధింపులు తాళలేక ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తల్లితండ్రులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న సంఘటనలోనూ వేధింపులే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. విద్యాసంస్థ రాష్ట్ర స్థాయిలోనే అతిపెద్ద విద్యాసంస్థ కావడంతో పోలీసుల దర్యాప్తు ఏం తేలనుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.