Nimmala Ramanaidu: నాపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కొట్టివేయండి - హైకోర్టుకు మంత్రి నిమ్మల రామానాయుడు
తనపై ఏలూరులో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కొట్టివేయాలని, తనకు ఊరట కల్పించాలని కోరుతూ మంత్రి నిమ్మల రామానాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
AP Minister Nimmala Ramanaidu | అమరావతి: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో తనమీద పెండిగ్ లో ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం తెలిసిందే. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. దాంతో పాటు కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. కేసు కొట్టివేసి తనకు ఊరట కలిగించాలని తన పిటిషన్‌లో మంత్రి రామానాయుడు కోరారు.
అసలేం జరిగిందంటే..
2022లో పాలకొల్లు పట్టణంలో టిడ్కో ఇళ్లను అర్హులకు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు నిమ్మల రామానాయుడు. టీడీపీ నేత, ఆయన అనుచరులు తనను కులం పేరుతో దూషించి, గాయపరిచారని పాలకొల్లు వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. పోలీసులకు సైతం రామానాయుడు, టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. రమేష్ ఫిర్యాదుతో పాలకొల్లు పోలీసులు 2022 ఆగస్టు 5న నిమ్మల రామానాయుడు, ఆయన అనుచరులపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఆయనపై పోలీసులు ఛార్జిషీట్ సైతం దాఖలు చేశారు.