AP Assembly Election 2024: గోపాలపురంలో గెలుపెవరిది? వైసీపీ స్ట్రాటజీ ఫలిస్తుందా?
Gopalapuram News: పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గెలుపెవరిది..? వైసీపీ స్ట్రాటజీ ఫలిస్తుందా..? వైసీపీకి టీడీపీ-జనసేన కూటమి చెక్‌పెడుతుందా..?
AP Assembly Election 2024 Gopalapuram: గోపాలపురం నియోజకవర్గం.. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. రాజమండ్రి లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2 లక్షల 41 వేల 884. వీటిలో పురుషులు లక్షా 18వేల 864 మంది. మహిళా ఓట్లు లక్షా 23వేల 13. గోపాలపురం నియోకవర్గానికి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ ఏడు సార్లు, కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించాయి. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎవరెవరు గెలిచారు. ఎన్ని ఓట్లతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంతా. అనేది ఒక్కసారి చూద్దం.
గత ఎన్నికలు.. అంటే 2019 ఎన్నికల్లో... గోపాలపురం నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తలారి వెంకట్రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి అయిన ముప్పిడి వెంకటేశ్వరరావుపై 37వేల 461 ఓట్ల మెజారిటీ సాధించారు తలారి వెంకట్రావు. అంతుకుముందు ఎన్నికలు.. అంటే.. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున బరిలో నిలిచిన ఎం. వెంకటేశ్వరరావుకు గెలిచారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరావుపై 11వేల 541 ఓట్ల మెజార్టీ సాధించారు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు. వెంకటరావుకు 83వేల 759 ఓట్లు పోలయ్యాయి.
2009 ఎన్నికల్లో... గోపాలపురం నుంచి టీడీపీ తరపున తానేటి వనిత గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి తిరుపల్లి ఉషపై 14వేల 653 ఓట్ల మెజార్టీతో గెలిచారు తానేటి వనిత. ఇక.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దల సునీత గెలిచారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ (తెలుగుదేశం పార్టీ) అభ్యర్థి కొప్పక అబ్బులుపై 7వేల 622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సునీతకు 67వేల 500 ఓట్లు రాగా... అబ్బులుకు 59వేల 878 ఓట్లు లభించాయి.
1994, 1999లో టీడీపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జొన్నకూటి బాబాజీరావు. ఆ తర్వాత పరిణామాలతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక.. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దాల సునీతపై 2వేల 986 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి కె.వివేకానందపై 39వేల 460 ఓట్ల మెజార్టీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి జె.బాబాజీరావు. 1983, 1985, 1989లో టీడీపీ తరపున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కారుపాటి వివేకానంద. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి సరోజని దేవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక.. 1972లో ఇండిపెండ్ అభ్యర్‌థి ఎస్. వెంకట్రావు, 1962, 1967లో వరుస రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి టి.వీరరాఘవులు ఎమ్మెల్యేగా గెలిచారు.
2024 ఎన్నికల కోసం... నియోజకవర్గాల్లో మార్పులు-చేర్పులు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... గోపాలపురం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తానేటి వనితను నియమించింది. ఆమె... 1994, 1999లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జొన్నకూటి బాబాజీరావు కుమార్తె. 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2012లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో మళ్లీ గోపాలపురం నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా వచ్చారు తానేటి వనిత. తండ్రి నాటి నుంచి నియోజకవర్గ ప్రజలతో ఆమెకు ఉన్న అనుబంధం... వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కలిసొస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానం భావిస్తోంది. నియోజకవర్గంలో వనిత కుటుంబానికి ఉన్న ఆదరణ దృష్ట్యా... బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు టీడీపీ కూడా ప్రయత్నిస్తోంది.