Konaseema District: కోనసీమ జిల్లాలో గ్రామ సచివాలయంపై పెట్రోల్ పోసి నిప్పు, స్థానికంగా కలకలం
Ambedkar Konaseema District: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ సచివాలయంపై మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ ప్యాకెట్ పోసి నిప్పు పెట్టాడు.
Ambedkar Konaseema District: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం.. అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ సచివాలయంపై మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ ప్యాకెట్ పోసి నిప్పు పెట్టాడు. అయితే పెట్రోల్ ప్యాకెట్ సచివాలయ అరుగుపై పడడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇది అకతాయిల పనా లేక ఉద్దేశ్యపూర్వకంగా మంట పెట్టారా అన్న దానిపై స్పష్టత లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బోడసకుర్రు గ్రామ సచివాలయం నిర్మాణంలో ఉండడంతో ఓ పురాతన పెంకుటిల్లులో అద్దె ప్రాతిపదికన సచివాలయం నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని సిబ్బంది సచివాలయానికి తాళం వేసి వెళ్ళిపోయారు. రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో సచివాలయ అరుగుపై ఒక్కసారిగా మంటలు రావడంతో గమనించిన స్థానికులు మంటలను ఆర్పి సమాచారాన్ని సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి భర్త నాగేశ్వరరావుకు అందించారు. వెంటనే పరిశీలించగా మంటలకు సచివాలయ నోటీసు బోర్డు, అక్కడ అతికించిన పలు ప్రకటనలు కాలిపోయాయి. అంతకు మించి ఎటువంటి నష్టం కలుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన అగంతకుడు ద్విచక్ర వాహనం పై వచ్చాడని, ఆపై గ్రామం వైపుగా వెళ్లినట్లు చూశామని స్థానికుల్లో కొందరు చెబుతున్నారు. ఈసంఘటనసై సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి శింగంపల్లి దుర్గాశ్రీనివాస్ అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సచివాలయాల్లో 13,995 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు ఏర్పాడ్డాయి. తాజాగా గుర్తించిన ప్రకారం మొత్తం 13,995 ఖాళీలున్నట్లు తేలింది. వీటిల్లో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైనా దృష్టి సర్కారు సారిస్తోంది. ఈ మేరకు అన్ని శాఖలకూ ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల్లో అధికంగా పశుసంవర్థక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో 4,765 పశుసంవర్థక సహాయకుల ఖాళీలు ఉండగా, ఆ తర్వాత విద్యుత్‌శాఖలో గ్రేడ్-2 ఖాళీలు 1,127 ఉన్నట్లు తేలింది. ఇక హార్టికల్చర్ విభాగంలో 1496 అసిస్టెంట్ పోస్టులు, గ్రేడ్-3 మహిళా పోలీస్ పోస్టులు 1092, గ్రామ సర్వేయర్ సహాయకుల పోస్టులు 1027 ఖాళీగా ఉన్నాయి.
మొత్తం ఖాళీల్లో అత్యవసర పోస్టులేవి? వేటిని త్వరగా భర్తీ చేయాలి? ఎందులో తదుపరి నియామకాలు అవసరం లేదు? అన్న దానిపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మహిళా పోలీస్, గ్రామ సర్వేయర్ సహాయకులు, మున్సిపల్, పట్టణాభి వృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాల కార్యదర్శులు, ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శి, పారిశుద్ధ్యం, పర్యావరణం, విద్య, వార్డు పాలన, వార్డు సంక్షేమానికి సంబంధించిన కార్యదర్శుల పోస్టుల ఖాళీలను భర్తీ చేయరాదని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఖాళీలే దాదాపు 3,905 వరకు ఉన్నట్లు తేలింది. మరికొన్ని పోస్టులను స్థానిక భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
జాబ్ చార్టు లేని పోస్టులు..
దాదాపు ఎనిమిది కీలక శాఖల్లో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టులకు ఇప్పటిదాకా జాబ్ చార్టు ఖరారు కాలేదు. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని సంక్షేమం - విద్య సహాయకులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకోలేక, అంతర శాఖలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక రాకపోవడంతో వారికి జాబ్ చార్టు ఖరారు చేయలేదు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, అంగన్వాడీ పోస్టుల జాబ్ చార్టు అంశం ఆయా శాఖాధిపతుల వద్దనే ఇంకా పెండింగ్‌లో ఉండగా, పట్టు శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి వద్దనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.