Laxman Reddy On Jagan Governament : అప్పట్లో బెల్ట్ షాపులు ఇప్పుడు ఇంటింటికి డోర్ డెలివరీ - జగన్ ప్రభుత్వంపై జనవిజ్ఞాన వేదిక లక్ష్మణరెడ్డి ఘాటు విమర్శలు !
జగన్ ప్రభుత్వంపై జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు బైక్‌పై ఇంటింటికి మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. వేల కోట్ల అవినీతి జరుగుతోందన్నారు.
Laxman Reddy On Jagan Governament : ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు , ఏపీలో దాదాపుగా మూడేళ్ల పాటు మద్య పాన నిషేధ ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఉన్న వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి .. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో బెల్ట్ షాపులు ఉండేవని..కానీ ఇప్పుడు ఇంటింటికి బైక్ పై తీసుకెళ్లి మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. మద్యపాననిషేధ ప్రచారకమిటీకి ఛైర్మన్ గా ఉన్న తాను.. దశలవారీగా మద్య నిషేధం చేస్తానన్‌న జగన్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మానన్నారు. కానీ మద్యపాననిషేధం గురించి ఏం చేయబోతున్నారోనన్న ఉత్సుకతతో తాను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తీవ్రంగా నిరుత్సాహపడ్డానన్నారు.గతంలో ఒక ప్రైవేట్ మద్యం దుకాణం పరిధిలో సాధారణంగా చుట్టూ వందబెల్ట్ షాపులు ఉండేవి...కానీ ఇప్పుడు ఒక బైక్ తీసుకొని ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. ప్రతి ఊరిలో కల్తీమద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయన్నారు. విజయవాడలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం - ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు పేరిట టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో లక్ష్మణరెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ఒక్క మద్య నిషేధ అంశంపైనే కాకుండా.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైనా మాట్లాడారు. ప్రజలు ప్రధాన సమస్యలు చర్చించకుండా సమస్యలు కాని వాటిని సమస్యలుగా చిత్రీకరిస్తున్నారని ప్రభుత్వ పెద్దలపై లక్ష్మణరెడ్డి ఆరోపణలు చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇది వరకు నిరంతరం ఏదో ఒకసమస్యపై పోరాడే వారన్నారు.అలాంటివారు ఇప్పుడు 1వ తేదీన జీతం వస్తే చాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు వారి సమస్యలపై పోరాడకుండా చేస్తున్నారన్నారు.ఆరోపించారు. రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని లక్ష్మణరెడ్డి పలు ఉదాహరణలు చెప్పారు.
ఏపీకి వస్తున్న పెట్టుబడులు కూడా పూర్తిగా ఆగిపోయాయన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే 2014-19తో పోలిస్తే ఈ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 14 రెట్లు తగ్గాయని లెక్కలు వివరించారు. వ్యవసాయ ఆధార రాష్ట్రమైన ఏపీలో సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని కానీ..ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని లక్ష్మణరెడ్డి విమర్శించారు. 1952 నుంచి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ఈ ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలా చాలా తక్కువన్నారు. సామాజిక పురోగతి సూచిలో రాష్ట్రం 23వ స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వేలకోట్ల అవినీతి జరుగుతున్నా దానిపై ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జన విజ్ఞాన వేదిక పేరుతో స్వచ్చంద సంస్థ పెట్టి.. చాలా కాలంగా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు లక్ష్మణరెడ్డి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర లేకుండానే సొంతంగానే సమావేశాలు పెట్టేవారు. మేధావులను పిలిచి చర్చలు జరిపేవారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పేవారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకు మద్య పాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. గత ఏడాది పదవి కాలం ముగియడంతో.. 2021 అక్టోబర్‌లో మరో ఏడాది పొడిగింపు ఇచ్చారు. అది ఈ ఏడాది అక్టోబర్‌లో ముగిసింది. ఆ తర్వాత పొడిగింపు ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వలేదు.