Chandragiri Arrest : పులివర్తి నానిపై దాడి కేసలో 13 మంది అరెస్ట్ - రిమాండ్‌కు తరలింపు
Andhra News : చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం కేసులో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో భానుకుమార్ రెడ్డి, తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు.
Elections 2024 : తిరుపతి జిల్లా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు ప్రధాన నిందితులు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితులందర్నీ చిత్తూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. 150 మందికి పైగా రాడ్లు, సుత్తులతో దాడి చేశారు. ఓ బండరాయి నాని ఛాతికి బలంగా తగిలింది. ప్రాణాపాయం నుంచి పులివర్తి నాని త్రుటిలో తప్పించుకోగా అడ్డుకున్న గన్‌మెన్ ధరణిపైనా దాడి జరిగింది. దీంతో ఆయన ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపారు.
స్ట్రాంగ్ రూం పరిశీలనకు వెళ్లిన పులివర్తి నానిపై దాడి
పోలింగ్ జరిగిన మరుసటి రోజు పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన నానిపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. మారణాయుధాలతో దాడి చేశారు. ప్రాణాపాయం నుంచి పులివర్తి నాని తప్పించుకున్నారు. నాని భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో పోలీసుల పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఉందని విమర్శలు వచ్చాయి. దాడి ఘటన తర్వాత కూడా ఎవర్నీ అరెస్టు చేయకపోవడంతో విమర్శలు వచ్చాయి.
దాడి కుట్రలో రిటర్నింగ్ అధికారి ఉన్నారని పులివర్తి నాని ఆరోపణ
తాను ఈవీఎం స్ట్రాంగ్ రూముల పరిశీలనకు వెళుతున్న సమాచారం రిటర్నింగ్ అధికారికి మాత్రమే తెలియజేశానని పులివర్తి నాని చెప్పారు. రిటర్నింగ్ అధికారి తన రాక గురించి అధికార పార్టీకి సమాచారం ఇచ్చారని.. ముందస్తు ప్రణాళిక లేకుండా దాడి జరిగే అవకాశం లేదని పులివర్తి నాని ఆరోపిస్తున్నారు. రిటర్నింగ్ అధికారితో పాటు కొందరు పోలీసు అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించడంతోనే తనపై దాడి జరిగిందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారిపై తమకు నమ్మకం లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని పులివర్తి నాని ప్రకటించారు.
ఏపీలో పోలింగ్ అనంతర హింసపై దేశవ్యాప్తంగా చర్చ
పోలింగ్ తర్వాత ఏపీలో పెరిగిపోయిన హింస దేశవ్యాప్తంగా చర్చనయాంశం అవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. స్వయంగా అభ్యర్థిగా ఈవీఎం లు భద్రపరిచిన చోట దాడులు జరగడం సంచలనంగా మారింది. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయలేకపోవడంతో సీఎస్, డీజీపీలను ఎన్నికల సంఘం ఢిల్లీ పిలిపించింది. వారు ఢిల్లీలో ఉండగానే అరెస్టులు చేయడం సంచలనంగా మారింది.