Janasena : జనసేనలో చేరిన వెంటనే గుర్తింపు - వంశీకృష్ణ యాదవ్‌కు కీలక పదవి ఇచ్చిన పవన్
Pawan Kalyan : విశాఖ జనసేన అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణయాదవ్ ను పవన్ కల్యాణ్ నియమించారు. ఈ మేరకు నియామక పత్రం అందించారు.
Vamsi Krishna Yadav as the Urban District President of Visakha Janasena : విశాక ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ విశాఖ అర్బన్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు పవన్ నియామక పత్రం అందించారు. ఇటీవల పార్టీలో చేరిక సందర్భంగా ఆయన కండువా కప్పించుకోలేదు. అనర్హతా వేటు కిందకు వస్తుందన్న సంశయంతో ఆయన అధికారికంగా పార్టీలో చేరలేదని చెబుతున్నారు. కానీ ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినందున పార్టీ తరపున బీఫాం ఉండదని.. ఆయనకు అనర్హతా వవేటు వర్తించదన్న విశ్లేషణ రావడంతో జనసేన బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
వైసీపీలో అవమానాలతో రాజీనామా
వైసీపీలో పోటీ చేసే అవకాశాలు రావని తెలియడంతో ఆ పార్టీకి వంశీకృష్ణ రాజీనామా చేశారు. పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. అందుకే తాను వైసీపీ నుంచి జనసేనలో చేరానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వెల్లడించారు. ఇటీవల జనసేనలో చేరిన ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లు అమ్ముకున్నానని.. తన రాజకీయ భవిష్యత్ నాశనం కావడానికి వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించడమే తన లక్ష్యమని వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. వైసీపీలో గుడివాడ అమర్నాథ్ జాక్‌పాట్‌తో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వంశీకృష్ణ యాదవ్ హెచ్చరించారు.
ప్రజారాజ్యం నుంచే వంశీ కృష్ణ రాజకీయ జీవితం ప్రారంభం
ఉత్తరాంధ్రకు చెందిన వంశీకృష్ణ గతంలో ప్రజారాజ్యంలో పని చేశారు. యువరాజ్యం తరపున తరపున అప్పటి ప్రభుత్వంపై పవన్ కల్యాణ్‌తో పాటు పోరాటం చేశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వంశీ కృష్ణ వైసీపీలో చేరారు. విశాఖ నుంచి ఎమ్మెల్సీగా పని చేశారు. చాలా రోజుల తర్వాత వంశీకృష్ణ జనసేనలో చేరడంతో సొంత ఇంటికి వచ్చినట్టైంది. దీంతో పవన్ కల్యాణ్ సైతం హర్షం వ్యక్తం చేశారు. ఏనమ్మకంతో అయితే వంశీకృష్ణ జనసేనలో చేరారో.. పవన్ కల్యాణ్ అంతటి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి వంశీకృష్ణ మనస్ఫూర్తిగా కృషి చేస్తారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
ప్రాధాన్యం ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్న పవన్
పార్టీలో వంశీకృష్ణకు తగిన ప్రాధాన్యం ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీయిచ్చారు. వంశీ నమ్మకాన్ని వమ్ముచేయబోమని, ఆయనకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. వంశీకృష్ణ లాంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. ఉత్తరాంధ్రలో పార్టీలో బలోపేతానికి ఆయన పాటు పడాలని ఆకాంక్షించారు. టీడీపీతో సీట్ల కేటాయింపులపై ఇంకా స్పష్టత రానందున వంశీకృష్ణ పోటీ చేస్తారో లేదో స్పష్టత లేదు.