Janasena Tenali : తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ఫైనల్ - మరి పొత్తుల సంగతేంటి ?
తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పొత్తుల గురించి పవన్ పట్టించుకోవడం లేదా ?
Janasena Tenali : తెనాలి నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్దిగా నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో తెనాలి నుండి జనసేన పార్టినే పోటీ చేస్తుందని ఫిక్స్ చేశారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. పొత్తుల్లో భాగంగా క్లారిటీ వస్తే ఈ మాట చెప్పారా లేకపోతే.. టీడీపీకి కౌంటర్ గా ఈ ప్రకటన చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
తెనాలి అభ్యర్ది నాదెండ్లే !
తెనాలి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ పేరు ఫిక్స్ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెనాలి నియోజకవర్గ నాయకులతో సమావేశం అయిన సందర్బంగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. దీంతో తెనాలి సీట్ జనసేన కేనా అనే అంశం తెర మీదకు వచ్చింది. జగనసేన నేతలతో కలసి నిర్వహించిన సమావేశానికి నాదెండ్ల మనోహర్ తో కలసి పవన్ కళ్యాణ్ హజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్దితులు, స్దానిక నాయకత్వం, తో మాట్లాడారు. పార్టి అభ్యర్దిగా నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ఫిక్స్ అయినందున ఎన్నికల్లో కలసి పని చేసి నాదెండ్లను గెలిపించాలని, నాయకులను పవన్ సూచించారు.
పొత్తుల మాటేంటి...?
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్లేవర్ పెరిగిపోయింది. దీంతో పొత్తుల వ్యవహరం పైనే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఎన్నికలకు కలసి వెళతామని జగన్ కు వ్యతిరేకంగా ఓటును చీలనీయమని పవన్ అనేక సార్లు ప్రకటించారు. అయితే ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు లో ఉన్న జనసేన, తెలుగు దేశం పార్టీని కూడా కలుపుకుని వెళ్లే విషయంలో చర్చలు నడుపుతోంది. దీని పై ఇంకా క్లారిటి రావాల్సి ఉంది. ఈ వ్యవహరం ఇంకా కొలిక్కి రాకుండానే, పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు. అంటే తెనాలి నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ పోటీ చేయటం పై సంకేతాలు ఇచ్చారు. ఎది ఎమైనా తెనాలి నుండి నాదెండ్ల కూటమి నుండి అభ్యర్దిగా నిలబెడతామని సంకేతాలు ఇచ్చేందుకే పవన్ ఇలాంటి ప్రకటన చేశారా అనే ప్రచారం కూడా ఉంది.
తెనాలిలో టీడీపీ అభ్యర్ది మాటేంటి...?
ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో తెలుగు దేశం పార్టీ నుండి ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజా వరుసగా పోటీ చేస్తున్నారు. తెనాలి నుండి జనసేన తరపున నాదెండ్ల పోటీ చేస్తే కూటమి లో ఉన్న తెలుగు దేశం పార్టి అభ్యర్దిగా ఆలపాటి రాజా పరిస్దితి ఎంటన్నది సస్పెన్స్‌లో పడింది. తెలుగు దేశం నుండి తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. అదే తెనాలి నుండి కాంగ్రెస్ లో కూడ నాదెండ్ల పోటీ చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లి స్పీకర్ గా విధులు నిర్వహించారు. జనసేన పార్టీతో పొత్తు ఉంటే.. టీడీపీ .. ఆ పార్టీలో నెంబర్ టు గా ఉన్న నాదెండ్ల మనోహర్ సీటును ఇవ్వబోమని చెప్పే అవకాశం లేదంటున్నారు. పొత్తు లేకపోతే అసలు సమస్యే ఉండదని..నాదెండ్లే అభ్యర్థి అవుతారని అంటున్నారు.