ఎన్టీఆర్ పేరుతో వంద రూపాయల కాయిన్- పురంధేశ్వరిని కలిసిన మింట్ అధికారులు
ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గతేడాది జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు.
నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ముఖచిత్రంతో వంద రూపాయల నాణెం రానుంది. ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న టైంలో మరో శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ కాయిన్‌ను ముద్రిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందుకే ఆమె తోనే మింట్ అధికారులు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆమెను కలిసి ఎన్టీఆర్ ఫొటో ఉన్న వంద రూపాయల కాయన్ నమూనాను కూడా చూపించారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గతేడాది జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నాణెం ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని జూన్ పదిన ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా వెల్లడించారు. ఎన్టీఆర్ కు భారతరత్న కూడా ఇవ్వాలని ఆమె కోరారు.