Srikakulam Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి, 30 మంది యాత్రికులకు గాయాలు
Andhra News: పండుగ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రావెల్స్ బస్సును మరో బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 30 మంది యాత్రికులు గాయపడ్డారు.
Bus Accident in Srikakulam: పండుగ రోజు శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పలాస (Palasa) మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ట్రావెల్స్ బస్సును మరో బస్సు ఢీకొట్టింది. పూరీ నుంచి అన్నవరం వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. దాదాపు 30 మంది యాత్రికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులను అంబులెన్సుల్లో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నేషనల్ హైవే సిబ్బంది క్రేన్ సాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించి.. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. మధ్యప్రదేశ్ అనుపూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు 2 ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో యాత్రలకు బయలుదేరారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథుని దర్శనం అనంతరం అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.