Gannavaram TDP Vs Ysrcp : గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత, టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి
Gannavaram TDP Vs Ysrcp : గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
Gannavaram TDP Vs Ysrcp : గన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఆఫీస్ ముందు ఉన్న కారుకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే వంశీపై టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు విజయవాడ రూరల్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్ వాహనాన్ని తగలబెట్టారు దుండగులు. వంశీపై టీడీపీ నేత దొంతు చిన్నా నిన్న విమర్శలు చేశారు. దీంతో వంశీ అనుచరులు దొంతు చిన్నా ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. సీఐ తలకు తీవ్రగాయం అయినట్లు తెలుస్తోంది.
టీడీపీ నేత ఇంటిపై దాడికి యత్నం!
గన్నవరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. టీడీపీ నేత దొంతు చిన్నా ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపుచేస్తున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడికి యత్నించారు.
వంశీపై విమర్శలు
రెండ్రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వంశీపై విమర్శలు చేశారు. వంశీపై విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఆయన అనుచరులు టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. టీడీపీ నేత దొంతు చిన్నా ఇంటిపై దాడికి ప్రయత్నించారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి చేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో వీరంగం ఆడారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం విశేషం. అంటే ఇది తాడేపల్లి సైకో కుట్ర అన్నమాట. pic.twitter.com/aWF0Fqs3DZ
— Telugu Desam Party (@JaiTDP) February 20, 2023
ఇది తాడేపల్లి కుట్ర- టీడీపీ
పోలీసులు సమక్షంలోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని, ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదంతా తాడేపల్లి కుట్ర అని విమర్శించింది. గన్నవరం ఎమ్మెల్యే వంశీకి బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. దమ్ముంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రావాలన్నారు.
ఆ గొడవతో నాకు సంబంధం లేదు- వంశీ
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. గొడవ జరుగుతొందని తెలిసే గన్నవరం వచ్చానన్నారు. నన్ను, కొడాలి నానిని ఇష్టం వచ్చినట్లు టీడీపీ నేతలు బూతులు తిట్టారని వంశీ ఆరోపించారు. ఇవాళ జరిగిన గొడవలో నా పాత్ర చాలా చిన్నదని వంశీ అన్నారు. నాపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గన్నవరంలో జరిగే ప్రతి విషయానికి నాకు సంబంధంలేదన్నారు.