New Airports in AP: ఏపీలో మరో 2 కొత్త విమానాశ్రయాలు! ఒంగోలు, నాగార్జున సాగర్లలో నిర్మాణానికి నోటిఫికేషన్
New Airports Proposal for AP: ఏపీలో మరో రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు రాబోతున్నాయి. నాగార్జున సాగర్, ఒంగోలులో విమానాశ్రయాల ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.

New Airports in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి. పూర్తిగా నూతనంగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కన్సల్టెంట్లను అన్వేషిస్తోంది. ఒంగోలు, నాగార్జున సాగర్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గ్లోబల్ కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తోంది. ఈ రెండు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు సాంకేతిక, ఆర్థిక పరమైన సాధ్యాసాధ్యాలపై Techno Economic Feasibility Report- TEFR లను తయారు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌ర్‌పోర్ట్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ – APADCL రిక్వేజైషేన్ ఆఫ్ ప్రపోజల్ RFP రిలీజ్ చేసింది. ఈ రెండు ప్రాంతాలను పరిశీలించి కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని అంతర్జాతీయ సంస్థలను కోరింది. జూలై 29 కల్లా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఏపీలో విమానాశ్రయాలు:
దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల సంఖ్య ఎక్కువే. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, తిరుపతి, కడపలో పూర్తిస్థాయి ఆపరేటింగ్ విమానాశ్రయాలున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతిలో పదుల సంఖ్యలో విమానాల ఆపరేషన్లు నిర్వహిస్తుండగా.. కడప, రాజమండ్రికి కూడా రోజూవారీ సర్వీసులున్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఓర్వకల్లులో మరో విమానాశ్రయం దాదాపు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్‌పోర్టు పనులు కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే ఐదు విమానాశ్రయాలు పూర్తి స్థాయి ఆపరేషన్లలో ఉంటే మరో ముడు కొన్నాళ్లలోనే సిద్ధమవుతున్నాయి. అవి కాకుండా పుట్టపర్తి లో ఉన్న ఎయిర్ స్ట్రిప్ తేలిక పాటి విమానాల ల్యాండింగ్‌కు పనికొస్తుంది. నాగార్జున సాగర్ ఎయిర్ స్ట్రిప్ శిక్షణ విమానాల కోసం వినియోగిస్తుండగా.. బొబ్బిలిలో పాతకాలం నాటి ఎయిర్ స్ట్రిప్ ఉంది.
జిల్లాకో విమానాశ్రయం
ఇప్పుడు పాత, కొత్త విమానాశ్రయాలు అన్నీ కలిపితే పాత జిల్లాల వారీగా చూస్తే ..జిల్లాకో విమానాశ్రయం వస్తున్నట్లే.. రాయలసీమలో పాత జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరుజిల్లాకు తిరుపతి, అనంతపురం జిల్లాకు పుట్టపర్తి, కర్నూలు జిల్లాకు ఓర్వకల్లు తోపాటు.. కడపలో విమానాశ్రయం ఉన్నాయి. కోస్తా జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో నిర్మితమవుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు తోడు.. మరో విమానాశ్రయాన్ని ప్రతిపాదించారు. భోగాపురం విజయనగరం జిల్లాలో ఉంది. విశాఖలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. రాజమండ్రి ఎయిర్‌పోర్టు ఆపరేషన్‌లో ఉంది. పశ్చిమ గోదావరి ఏలూరు, భీమవరంకు సమీపంలోనే ప్రస్తుత గన్నవరం ఎయిర్ పోర్టు ఉంది. ఇప్పుడు అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదన కూడా ఉంది. దానికి మరికొంత దూరంలోనే ఓ వైపు నాగార్జున సాగర్, ఇంకోవైపు ప్రతిపాదిత ఒంగోలు ఎయిర్ పోర్టు వస్తాయి. దానికి కాస్త దిగువకు వెళితే కావలి సమీపంలోని దగదర్తి వద్ద ఎయిర్ పోర్ట్ ఆల్రెడీ నిర్మితం అవుతోంది. కోస్తాలో కనిష్టంగా 50 కిలోమీటర్లకు గరిష్టంగా 150 కిలోమీటర్లకు ఓ విమానాశ్రయం కనిపిస్తున్నాయి.
ఇన్ని విమానాశ్రయాలు అవసరమా..?
ఆంధ్ర ప్రదేశ్ జనాభా, వైశాల్యాన్ని అనుసరించి ఇప్పటికే 5 విమానాశ్రయాలు పూర్తి స్థాయి ఆపరేషన్స్‌లో ఉన్నాయి. కొత్తగా దగదర్తి, ఓర్వకల్ విమానాశ్రయాలు రాబోతున్నాయి. భోగాపురం ఎలాగో సిద్ధమవుతోంది. అంటే 8 విమానాశ్రయాలు ఆపరేషన్స్ లో ఉంటాయి. మరి కొత్తగా తీసుకొచ్చే ఈ విమనాశ్రయాలకు వయబులిటీ ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే.. ప్రభుత్వం TEFR సిద్ధం చేస్తోంది. మరి మిగిలిన విషయాలు చూడాల్సి ఉంది. చెన్నై విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ The Visakhapatnam-Chennai Industrial Corridor (VCIC)లో భాగంగా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని దానిని దృష్టిలో ఉంచుకనే దగదర్తి ఎయిర్‌పోర్టు, ఒంగోలు విమానాశ్రయాన్ని ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఓర్వకుల్లు విమానాశ్రయం Orvakal Airport ను కూడా హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ను దృష్టిలో ఉంచుకునే నిర్మించారు.





















