YSRCP MLC Balli Kalyan: వైసీపీ ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఇంట విషాదం
వైసీపీ ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఇంట విషాదం నెలకొంది. దివంగత నేత, మాజీమంత్రి బల్లి దుర్గాప్రసాద్ రావు సతీమణి సరళమ్మ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు
వైసీపీ ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఇంట మరోసారి విషాదం నెలకొంది. రెండేళ్ల కిందట తండ్రి చనిపోయారు, ఇప్పుడు తల్లి కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దివంగత నేత, మాజీమంత్రి బల్లి దుర్గాప్రసాద్ రావు సతీమణి సరళమ్మ గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మెడికల్ చెకప్ కోసం వెళ్లిన సరళమ్మ మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె సభ్యులు పార్థివ దేహాన్ని ఈ ఉదయం నెల్లూరు జిల్లా వెంకటగిరికి తరలించారు. మధ్యాహ్నం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జగన్, చంద్రబాబు సంతాపం..
దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ రావు టీడీపీలో సీనియర్ నేత, ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వచ్చారు, 2019లో తిరుపతి ఎంపీగా ఘన విజయం సాధించారు. పదవిలో ఉండగానే మరణించారు. ఆయనతో చంద్రబాబుకి కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. దుర్గాప్రసాద్ రావు సతీమణి సరళమ్మ మృతిపై చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన సందేశం పంపించారు. సీఎం జగన్ కూడా సరళమ్మ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆ మధ్య దుర్గా ప్రసాద్ రావు మరణం తర్వాత కుమారుడు కల్యాణ్ చక్రవర్తిని తీసుకుని సరళమ్మ సీఎం జగన్ ని కలిశారు. తన బిడ్డ భవిష్యత్ గురించి అడిగారు. ఆ సందర్భంలో తిరుపతి ఎంపీసీటు తన కొడుక్కి ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. అయితే జగన్ కల్యాణ్ చక్రవర్తిని ఎమ్మెల్సీగా పంపిస్తానన్నారు. ఆ కుటుంబానికి తాను అండగా నిలబడతానన్నారు. సరళమ్మ కూడా జగన్ హామీ ప్రకారం నడచుకొన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బల్లి కుటుంబం గురుమూర్తికి పూర్తిగా సపోర్ట్ చేసింది. గురుమూర్తి తరపున కల్యాణ్ చక్రవర్తి కూడా ప్రచారానికి వెళ్లారు.
పార్థివ దేహానికి మంత్రి కాకాణి నివాళులు..
సరళమ్మ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి వెంకటగిరికి తరలించారు. నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, వెంకటగిరికి వెళ్లి కల్యాణ్ చక్రవర్తి కుటుంబానికి సంతాపం తెలిపారు. సరళమ్మ మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. రెండేళ్ల వ్యవధిలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన చక్రవర్తికి పార్టీ అండగా నిలబడుతుందని చెప్పారు కాకాణి.
బల్లి దుర్గాప్రసాద్ రావు సెప్టెంబర్ 16, 2020 లో కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వెంకటగిరిలో ఆయన సమాధి పక్కనే సతీమణి సరళమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు కుటుంబ సభ్యులు. సరళమ్మ మరణ వార్త విని నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నాయకులు వెంకటగిరికి తరలి వస్తున్నారు. వెంకటగిరిలోని స్థానిక వైసీపీ నేతలు ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి నివాసానికి చేరుకుంటున్నారు.