(Source: ECI/ABP News/ABP Majha)
Aadala In Nellore: ఆదాల వెంటే ఉంటాం, సీఎం జగన్ చెప్పినట్టే నడుచుకుంటాం - కొత్త ఇంఛార్జ్ కు పూర్తి మద్దతు
జగన్ బి ఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపించిన వ్యక్తి నమ్మక ద్రోహం చేశారని, వేరే పార్టీ లోకి వెళ్ళి పోవాలని నిర్ణయించుకుని ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారని అన్నారు నేతలు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టి తొలిసారి నగరానికి వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లా పార్టీ కన్వీనర్ బాలినేని శ్రీనివాసులరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహా కార్పొరేటర్లు, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆదాల నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట ప్రకారం కార్పొరేటర్లు, ఇతర నాయకులంతా ఆదాలతోనే ఉండాలని కోరారు. మేయర్ కూడా ఆదాలవైపే రావాలని సూచించారు. జగన్ బి ఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపించిన వ్యక్తి నమ్మక ద్రోహం చేశారని, వేరే పార్టీ లోకి వెళ్ళి పోవాలని నిర్ణయించుకుని ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారని అన్నారు నేతలు. కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగవద్దన, భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఇకపై రూరల్ లో అందరినీ కలుపుకుని వెళ్తానన్నారు ఆదాల.
కోటంరెడ్డి.. నీ ఆటలు సాగవు..
రూరల్ నియోజక వర్గానికి పట్టిన దరిద్రం నిన్నటితో పోయిందని ప్రజలు ఆనంద పడుతున్నారని అన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. కార్పొరేటర్లును భయ పెట్టినా ఎవరూ భయ పడలేదని 16 నుండి 18 మంది కార్పొరేటర్లు ఆదాలతోనే ఉంటారని ధీమాగా చెప్పారు. భవిషత్తు లో నెల్లూరు నగరం, రూరల్ ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి కోసం ఎవరూ బయటకు పోరని, అందరూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారన్నారు.
అన్ని సీట్లూ గెలుస్తాం..
నెల్లూరు జిల్లాలో తిరిగి అన్ని సీట్లు తామే కైవసం చేసుకుంటామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆ గెలుపుని సీఎం జగన్ కి కానుకగా ఇస్తామన్నారు. వైసీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట అని మరోసారి నిరూపిస్తామన్నారాయన. కార్పొరేటర్లు ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ తమ దగ్గరకు వస్తారని కొంతమంది మాట్లాడుతున్నారన, అది బాధాకరం అని చెప్పారు. ఒకరు వెళ్లిపోతే ఎంత మంది పార్టీ కోసం వస్తారో ర్యాలీలో తేలిపోయిందని చెప్పారు.
మేయర్ అర్థం చేసుకోవాలి..
మేయర్ టికెట్ సీఎం జగన్ ఇచ్చారని, రూరల్ ఎమ్మెల్యే కాదని ఆ విషయం నెల్లూరు మేయర్ స్రవంతి అర్థం చేసుకోవాలన్నారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ చార్జ్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి కి నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిన్న చిన్న పదవుల్లో ఉన్నవాడని, జగన్ దయతో ఎమ్మెల్యే అయ్యాడని, అది మరిచి పోయి ఇప్పుడు ఆయన్నే ధిక్కరించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి బాధపడే రోజు వస్తుందన్నారు బాలినేని. శ్రీధర్ రెడ్డి ఎందుకిలా చేశారని ఐప్యాక్ వారిని అడిగితే.. వారు జిల్లాలో అన్ని స్థానాలు వైసీపీకే వస్తాయని చెప్పారని, మరి శ్రీధర్ ఎందుకిలా తెలివి తక్కువ పని చేశాడో తమకు అర్థం కావడం లేదన్నారు.
బెదిరింపులు కుదరవు..
రూరల్ నియోజక వర్గంలో వ్యాపారస్తుల్ని, రియల్టర్లను, రైస్ మిల్లర్లను ఇప్పటి వరకూ బెదిరించి దోచుకున్నారని, ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు ఆదాల. తాను నిత్యం అందుబాటులో ఉంటా వారి కష్టాలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. రూరల్ నియోజక వర్గంలో ఎటువంటి అరాచక చర్యలు చేసినా ఉక్కు పాదం తో అణచి వేస్తామన్నారు. కార్పొరేటర్లంతా తమ వెంటే ఉన్నారన్నారు ఆదాల.