Vizag Sai Priya Issue: ఆర్కే బీచ్‌లో మిస్ అయి బెంగళూరుకు, వయా నెల్లూరు - ఇక్కడ ఏం జరిగిందంటే
Nellore: నెల్లూరు జిల్లా పోలీసులు తమని పట్టుకుంటారేమోనన్న అనుమానంతో వెంటనే సాయిప్రియ, రవి ఇద్దరూ బెంగళూరు వెళ్లిపోయారు.
విశాఖ ఆర్కేబీచ్ లో మాయమైపోయిన సాయిప్రియ ఎట్టకేలకు బెంగళూరులో తేలింది. అయితే మధ్యలో ఆమె నెల్లూరులో రెస్ట్ తీసుకోవడంతో కాసేపు జిల్లాలో కలకలం రేగింది. నెల్లూరు పోలీసులు కూడా హడావిడి పడ్డారు. అప్పటికే విశాఖ పోలీసులు ఆమెకోసం గాలింపు ముమ్మరం చేశారు. నేవీ అధికారులు హెలికాప్టర్లతో గాలించారు. గజ ఈతగాళ్లతో సముద్ర తీరంలో వెదుకులాట కూడా అయిపోయింది. అధికారులు హడావిడి పడ్డారు, పోలీసులు కూడా ఆమె జాడ తెలుసుకోడానికి కష్టపడ్డారు. తీరా ఆమె సముద్రంలో గల్లంతు కాలేదని, నెల్లూరులో ఉందనే సమాచారంతో నెల్లూరు జిల్లా పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా ఆమె గురించి సమాచారం తెలిసే లోపే నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్లిపోయిందని తెలిసింది.
నెల్లూరు జిల్లా కావలికి చెందిన రవి అనే వ్యక్తితో సాయిప్రియకు పరిచయం ఉంది. అతనితోపాటు ఆరోజు ఆమె విశాఖ బీచ్ నుంచి వెళ్లిపోయింది. నేరుగా నెల్లూరు జిల్లా కావలికి వచ్చింది. కావలిలో ఆమె ఉన్నట్టు ఎవరికీ సమాచారం లేదు. రవి కుటుంబం కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. మీడియా ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసినా సాయిప్రియ ఎక్కడుంది, ఎవరి సంరక్షణలో ఉంది అనే విషయం మాత్రం కనిపెట్టలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు కూడా కాస్త టెన్షన్ పడ్డారు. సాయిప్రియను వెదుకులాడేందుకు టీమ్స్ రెడీ చేశారు. కానీ అంతలోనే ఆమె మకాం మార్చేసింది.
నెల్లూరు జిల్లా పోలీసులు తమని పట్టుకుంటారేమోనన్న అనుమానంతో వెంటనే సాయిప్రియ, రవి ఇద్దరూ బెంగళూరు వెళ్లిపోయారు. విశాఖ నుంచి కావలి వచ్చిన వారు, కావలి నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడ రవి, సాయిప్రియ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను కూడా ఆమె తల్లిదండ్రులకు వాట్సప్ చేశారు. వాట్సప్ లోనే ఆడియో సందేశాలు కూడా పంపించారు. తాను బతకాలని అనుకుంటున్నానని, తమకోసం వెతకొద్దని వేడుకుంది. ఇప్పటికే పరిగెత్తి అలసిపోయామని, ఇక ఎక్కడికీ వెళ్లలేమని తెలిపింది.
వైజాగ్ నుంచి వచ్చిన సాయిప్రియ బెంగళూరుని సేఫ్ ప్లేస్ గా ఎంచుకుంది. రవితో కలసి పారిపోయిన ఆమె.. రాష్ట్రంలో ఉంటే ఏపీ పోలీసులు జల్లెడ పడతారని భావించి ముందుగానే బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపిస్తున్న సాయి ప్రియ, విశాఖ అధికారులను ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని అడిగింది. అధికారులను ఆమె కావాలని తప్పుదోవ పట్టించలేదు కానీ, అధికారులు మాత్రం ఆమెను వెదికే క్రమంలో ప్రజాధనం వృథా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సాయిప్రియ వైజాగ్ కి వస్తే ఆమెపై చర్యలు తీసుకుంటారా, లేక కుటుంబ గొడవలుగా ఆ వ్యవహారాన్ని వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ కుమార్తె మిస్సింగ్ అంటూ తండ్రి కేసు పెట్టారు, మరి ఆమెతో కలసి వెళ్లిన రవిపై చర్యలేమైనా తీసుకుంటారేమో చూడాలి.