ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయనను నెల్లూరు నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయనను నెల్లూరు నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స కొనసాగుతోంది.
గుండె పోటుతో నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. తన అభిమానులకోసం ఓ వీడియో విడుదల చేశారు. గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారని, తనకు మెరుగైన వైద్యం అందించారని, తాను బాగానే ఉన్నానని, అయితే డాక్టర్ల సలహా మేరకు చెన్నై వెళ్తున్నట్టు చెప్పారు.
గుండె పోటుతో నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నై అపోలోకి తరలించారు. ఆయన గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. గుండెపోటు రావడంతో ఆయన్ను వెంటనే నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వయసు 66 సంవత్సరాలు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఆయన స్వయానా సోదరుడు. చంద్రశేఖర్ రెడ్డికి భార్య రచనా రెడ్డి, కుమార్తె ప్రేమితా రెడ్డి ఉన్నారు. ఇటీవలే ఆయన శాంతి కుమారిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే శివచరణ్ రెడ్డి అనే యువకుడు ఇటీవల తాను చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినేనంటూ మీడియాకెక్కడంతో ఆ వ్యవహారం లైమ్ లైట్లోకి వచ్చింది.
చంద్రశేఖర్ రెడ్డికి కరోనా సోకడంతో గతేడాది ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకున్న ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాబాయ్, అబ్బాయ్ తరచూ ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చిస్తుండేవారు.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈసారి పార్టీ టికెట్ కోసం గట్టి కాంపిటీషన్ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. స్థానిక నాయకులు చాలామంది ఆయనకు వ్యతిరేకంగా మారారు. అయితే ఆయన వారందరినీ కాదని సొంత బలగాన్ని పెంచుకుంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇటీవల ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త విషయంలో ఆయన పార్టీపై రుసరుసలాడారు. ఉదయగిరి కోఆర్డినేటర్ గా ఉన్న కొడవలూరు ధనుంజయ్ రెడ్డిని వెంటనే తొలగించాలన్నారు. ఎట్టకేలకు ఆయన అభ్యర్థన మన్నించి కొత్త సమన్వయకర్తను నియమించారు. కొడవలూరి స్థానంలో మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డిని పార్టీ నియమించింది. ఆనం రామనారాయణ రెడ్డికి కుడి భుజంగా ఉన్న మెట్టుకూరుకి ఉదయగిరి కోఆర్డినేటర్ స్థానాన్ని ఇచ్చి అటు ఆనం వర్గంలోనూ కలకలం రేపారు సీఎం జగన్.