Nellore Crime : నెల్లూరు దాటితే చాలు లక్షలు చేతిలో వచ్చి పడ్డట్టే, రూటు మార్చిన కంత్రీగాళ్లు
ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఉన్న సరకును సరిహద్దులు దాటించేందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తున్నారు. ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు.
నెల్లూరు జిల్లా:
గంజాయి రవాణాపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపినా ఇంకా స్మగ్లింగ్ పూర్తిగా ఆగిపోలేదు. ఓవైపు విశాఖ మన్యంలో గంజాయి తోటల్ని పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పట్టుబడిన గంజాయిని తగలబెట్టేస్తున్నారు. కానీ ఎక్కడో ఓ చోట గంజాయి నిల్వ చేసి దాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేస్తున్నారు కొంతమంది స్మగ్లర్లు. ముఖ్యంగా ఏపీ, తమిళనాడుకి సరిహద్దుగా ఉన్న నెల్లూరుకి గంజాయి తరలించి, ఇక్కడి నుంచి దాన్ని సులువుగా బోర్డర్ దాటించేస్తున్నారు.
ఇటీవల నెల్లూరు-చెన్నై, నెల్లూరు-తిరుపతి బస్సుల్లో గంజాయిని పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. బస్సులు, రైళ్లలో తీసుకెళ్తే తనిఖీలు చేస్తున్నారని, ఏకంగా ఓ ప్రైవేటు వాహనంలో సరకులు తీసుకెళ్తున్నట్టు కలరింగ్ ఇచ్చి గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. విశాఖ పట్నానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 40కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 5 లక్షల రూపాయలుగా నిర్థారించారు పోలీసులు.
నెల్లూరే కీలకం..
గంజాయి స్మగ్లింగ్ కేసుల్ని పట్టుకోడానికి నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే.. గంజాయిని అధిక ధరకు చెన్నైలో అమ్మేసుకోవచ్చు. విశాఖ లో 3వేలకు కేజీ గంజాయి కొనుగోలు చేసి, చెన్నైలో 13వేలకు కేజీ గంజాయి అమ్ముతారని తెలుస్తోంది. గంజాయిని ఏ రూపంలో, ఏ వాహనంలో తరలించినా.. గట్టి నిఘా పెట్టామని, పోలీసులు కళ్లు కప్పి తీసుకు పోలేరని చెబుతున్నారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు.