Nellore Temple Gold: 80కేజీల బంగారంతో అమ్మవారికి అలంకారం, చూసిన భక్తుల కళ్లు జిగేల్ !
ఆలయంలో అమ్మవారికి బంగారు ఆభరణాలు వేస్తుంటారు. ఉత్సవాల సమయంలో మరిన్ని ఆభరణాలు తెచ్చి అలంకరిస్తారు. కానీ ఏకంగా 80కేజీల బంగారంతో అమ్మవారికి అలంకారం చేశారంటే మాటలా..? ఆ సంబరం చూడటానికి రెండు కళ్లూ చాలవు.
ఆలయంలో అమ్మవారికి బంగారు ఆభరణాలు వేస్తుంటారు. ఉత్సవాల సమయంలో మరిన్ని ఆభరణాలు తెచ్చి అలంకరిస్తారు. కానీ ఏకంగా ఓ ఆలయంలో 80కేజీల బంగారంతో అమ్మవారికి అలంకారం చేశారంటే మాటలా..? వామ్మో ఆ సంబరం చూడటానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. అలాంటి ఘనమైన అలంకారం చూడాలంటే మీరు కచ్చితంగా నెల్లూరు రావాల్సిందే. స్టోన్ హౌస్ పేటలో వెలసిన కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించాల్సిందే.
మన తెలుగు రాష్ట్రాల్లో ఏదీ సాధారణంగా చేయరు.. అన్నీ చేస్తారు ఎంతో ఘనంగా... అంటూ ఓ టీపొడి అడ్వర్టైజ్ మెంట్ ఇటీవల వైరల్ గా మారింది. ఇలాంటి ఘనమైన కార్యాలు చేయడంలో నెల్లూరోళ్లు పెట్టింది పేరు. అవును, నెల్లూరులోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఇలాగే ఎంతో ఘనంగా చేస్తున్నారు. అమ్మవారి అలంకరణకు ఏకంగా నగల షాపునే తరలించారు.
నగరంలోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపు సౌజన్యంతో అమ్మవారి ఆలయాన్ని ఇలా ఆభరణాలతో అలంకరించారు. ఆభరణాల్లో అన్ని వెరైటీలు ఉన్నాయి. నెక్లెస్ లు, బ్రేస్ లెట్లు, చైన్లు, గాజులు, ఉంగరాలు, లాంగ్ చైన్లు, చౌకర్లు.. ఇలా బంగారంతో ఏయే ఆభరణాలు చేస్తారో.. వాటన్నిటినీ ఆలయానికి తెచ్చి కుప్ప పోశారు.. వాటితో అందంగా అలంకరించారు. అమ్మవారి రూపాన్ని కూడా ఆభరణాలతోనే తీర్చిదిద్దారు.
వీటితోపాటు గోల్డెన్ తళుకులతో అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దడం మరో ప్రత్యేకత. నెల్లూరు కన్యకా పరమేశ్వరి ఆలయంలో చేసిన ఈ అలంకార శోభ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నగరంలోని ప్రతి ఒక్కరూ ఆలయాన్ని దర్శించుకోడానికి క్యూ కడుతున్నారు.
ఇటీవలే నెల్లూరులోని కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని పునరుద్ధరించారు. పురాతన ఆలయానికి నూతన హంగులద్దారు. దసరా సందర్భంగా అమ్మవారికోసం చేయించిన 100 కేజీల వెండి రథాన్ని కూడా ఆవిష్కరించారు. 1008 కళశాలతో పెన్నా నది జలాలను తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకించారు. రథాన్ని కూడా పెన్నా పవిత్ర జలాలతో అభిషేకించారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంబించడమే కాదు, ప్రతిరోజూ ఘనగా అమ్మవారి అలంకారం చేస్తున్నారు. నెల్లూరు నగరంలోనే అత్యంత అద్భుతంగా ఈ ఆలయంలో అమ్మవారి అలంకారం చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరులోని ప్రధాన ఆలయాల్లో కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరి దేవస్థానంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో కూడా 9రోజులపాటు ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు. ప్రతి రోజూ ప్రత్యేక అలంకారంలో అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నారు. 80కేజీల బంగారంతో తాజాగా అమ్మవారికి అలంకారం చేసి, ఆభరణాలతో అమ్మవారి రూపాన్ని తయారు చేశారు. ఈ అలంకరణ చూడటానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భక్తులు కన్యకా పరమేశ్వరి ఆలయానికి తరలి వస్తున్నారు.
ఆభరణాల అలంకరణకోసం సహకరించిన జ్యుయలరీ షాపు యాజమాన్యానికి ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. బంగారు ఆభరణాలను భారీ భద్రత మధ్య ఆలయానికి తరలించారు, అంతే భద్రంగా తిరిగి తీసుకెళ్తారు. 80కేజీల బంగారంతో ఆలయ అలంకరణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.