Selfie With Snake: ప్రాణం తీసిన స్నేక్ సెల్ఫీ - కోరల్లేని పాము అనుకుని సరదాపడితే విషాదం
పాము కిందికి దిగిన తర్వాత దాని తోక పట్టుకుని లాగాడు. ఈ క్రమంలో ఆ పాము మణికంఠ చేతిపై కాటు వేసింది. ఒంగోలు రిమ్స్ కి తరలిస్తుండగా మణికంఠ రెడ్డి ప్రాణం పోయింది.
పాముతో సెల్ఫీ దిగాలనుకున్న ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లా కందుకూరులో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా తాళ్లూరుకు చెందిన మణికంఠరెడ్డి కందుకూరు ఆర్టీసి డిపో దగ్గర జ్యూస్ షాపు నిర్వహిస్తుండేవాడు. జ్యూస్ షాప్ దగ్గరికి పాములు ఆడించే వ్యక్తి వచ్చాడు. దీంతో అతడి దగ్గరనుంచి మణికంఠ పామును తీసుకుని తన మెడలో వేసుకుని సెల్ఫీ దిగాడు. పాము కిందికి దిగిన తర్వాత దాని తోక పట్టుకుని లాగాడు. ఈ క్రమంలో ఆ పాము మణికంఠ చేతిపై కాటు వేసింది. స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కి తరలిస్తుండగా మణికంఠ రెడ్డి ప్రాణం పోయింది.
పాములను ఆడించుకునేవారు, పాములను పట్టేవారు ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తున్నారు. అక్కడక్కడ పల్లెటూళ్లలో మాత్రం పాములు పట్టేవారు, పాములను ఆడించుకునేవారు కనిపిస్తుంటారు. అయితే వీరిలో చాలామంది పాముల కోరలను తీసేసి వాటిని ఆడిస్తుంటారు. కొన్నిసార్లు పాములు ఆడించేటప్పుడు వాటి కోరల్లో విషం తీసి జనాలకు చూపించేందుకు కోరలు ఉన్న పాముల్నే తీసుకొస్తుంటారు. వాటితో ప్రమాదకరంగా ఆడిస్తుంటారు. కందుకూరులో జరిగిన ఘటనలో కూడా పాములు పట్టే వ్యక్తి నిర్లక్ష్యం వల్లే మణికంఠ రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
పాములు పట్టేవారు వాటిని ఎవరి చేతికీ ఇవ్వరు. నేర్పుగా, ఒడుపుగా పట్టుకున్నా కొన్నిసార్లు పాములు చేజారిపోతే దొరకవు. ఒకవేళ వాటిని పట్టుకునే ప్రయత్నం చేసినా పడగవిప్పి బుసకొడతాయి. అందుకే వాటిని ఇతరుల చేతికి ఇవ్వరు. కానీ కందుకూరు ఘటనలో మాత్రం పాములు పట్టే వ్యక్తి మద్యపానం సేవించినట్టు అనుమానాలున్నాయి. మద్యం మత్తులో అతను పాముల బుట్టను తీసుకొచ్చి ఓ హోటల్ లో తెరిచాడు. హోటల్ ఓనర్ అతడిని అదిలించి పంపించేశాడు. ఆ తర్వాత అతను రోడ్డుపై పాముల బుట్టను ఉంచి వచ్చేపోయే వారిని డబ్బులు అడగటం మొదలు పెట్టాడు. అక్కడినుంచి కూడా స్థానికులు పంపించేసరికి దగ్గరే ఉన్న లస్సీ షాపు దగ్గరకు వెళ్లాడు. ఆ షాపు ఓనర్ మణికంఠ రెడ్డికి సెల్ఫీ పిచ్చి ఉన్నట్టు తెలుస్తోంది. సెల్ఫీకోసం సాహసాలు చేసే మణికంఠ.. కోరల్లేని పాము అనుకుని దాన్ని మెడలో వేసుకున్నాడు. సెల్పీ తీసుకున్నాడు. అయితే అదే అతని చివరి సెల్ఫీ అవుతుందని ఊహించలేకపోయాడు. కానీ అదే అతని చివరి సెల్ఫీ అయింది. ఆ తర్వాత అతను సెల్ఫీ తీసుకునే వీలే లేకుండా పోయింది. అతని ప్రాణం పోయింది.
మణికంఠ సెల్ఫీ తీసుకున్న తర్వాత కూడా పాము కాసేపు అతని దగ్గరే ఉంది. ఆ తర్వాత మెడలోనుంచి కిందకు తీసే క్రమంలో అది కిందపడిపోయింది. కిందపడిపోయిన పాముని తోక పట్టుకుని లాగాడు పాములు పట్టే వ్యక్తి. అది చూసి మణికంఠ కూడా దాని తోకపట్టి లాగాడు. అంతే.. ఒక్క ఉదుటున పాము పడగ విప్పింది, మణికంఠ మణికట్టుపై కాటు వేసింది. వెంటనే అతను స్పృహ కోల్పోయాడు. స్నేహితులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వాంతులు చేసుకుంటుండగా.. ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే మణికంఠ ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు చెప్పారు.