Mekapati Funeral Updates: గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు, హెలికాప్టర్‌లో నెల్లూరుకు మంత్రి భౌతిక కాయం
Hyderabad Mekapati House: జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గౌతమ్ రెడ్డి భౌతికకాయం ఉంచిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నేడు నెల్లూరుకు తరలించనున్నారు.
Gowtham Reddy Funeral in Nellore: కార్డియాక్ అరెస్టుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం విషయంలో మార్పు జరిగింది. ఆయన అంత్యక్రియలను నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన అంత్యక్రియలను తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని అనుకున్నారు. ఆ తర్వాత ఉదయగిరిలోని సొంత విద్యా సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్దకు మార్చారు. రేపు (ఫిబ్రవరి 23) ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గౌతమ్ రెడ్డి భౌతికకాయం ఉంచిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నేడు నెల్లూరుకు తరలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో గౌతమ్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి నేరుగా నెల్లూరులోని నివాసానికి తరలించనున్నారు. ఉదయం 8.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ బయల్దేరి, ఉదయం 11 గంటల వరకు నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకోనుంది.
నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శన కోసం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. చివరి సారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు రాత్రికి అమెరికా నుండి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రానున్నారు. హెలికాప్టర్‌లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయంతో తల్లి మణి చమంజరి, సతీమణి శ్రీకీర్తి వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు వెళ్లారు. 23న ఉదయం ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంత్రి అంతక్రియలు జరుగుతాయి.
మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయినట్లుగా ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి మృతికి సంతాప సూచకంగా 2 రోజులు అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటించారు. నేడు జరగాల్సిన జగనన్న తోడు మూడోవిడత ఆర్థిక సాయం అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఈ సాయాన్ని అందించనున్నారు.