Nellore : నెల్లూరు జిల్లా కరేడు గ్రామ ప్రజల ఆగ్రహం.. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇచ్చేది లేదంటూ ప్రకటన!
Nellore Latest News: నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఇండోసోల్ కంపెనీభూసేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రాణాలు పోయినా భూములు మాత్రం ఇవ్వబోమని స్పష్టం చేశారు.

Nellore Latest News: శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కరేడు గ్రామ ప్రజలు కన్నెర్ర చేశారు. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూసేకరణ కోసం శుక్రవారం జరిగిన అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మొదటి నుంచి ఇండోసోల్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నామని అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయం తెలుసుకోకుండానే భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
ఇండోసోల్ కోసం భూములు కేటాయించి శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భూములు కేటాయించి ఇప్పుడు ప్రజాభిప్రాయసేకరణ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని రకాలుగా వచ్చినా ఒక్క ఎకరా కూడా పరిశ్రమకు ఇచ్చేది తెగేసి చెప్పారు. దీంతో గ్రామ సభ మొదలైన కాసేపటికే ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యంతో పరిస్థితి చక్కబడినా ప్రజల అభిప్రాయం మాత్రం మారలేదు. "ఇండోసోల్ వద్దు.. మా భూములు ఇచ్చేది లేదు, సేవ్ కరేడు" అంటూ ప్రజలు గళమెత్తారు.
కనీసం ప్రభుత్వ ప్రతిపాదన ఏంటీ అనే విషయాన్ని కొందరు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిపై మిగతా ప్రజలు మండిపడ్డారు. భూములు ఇచ్చే ఆలోచన లేనప్పుడు మిగతా వాటి గురించి ఎందుకు ఆరా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దాడికి యత్నించారు. మిగతా ప్రజలు జోక్యం చేసుకొని రైతులను వారించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇలాంటి వివరాలు తెలుసుకునే వారంతా తమ గ్రామస్తులు కాదని అంటున్నారు. బయట వ్యక్తులు ఇక్కడకు వచ్చి భూములు ఇచ్చేందుకు అనుకూలం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరేడు గ్రామానికి చెందిన ఒక్క రైతు కూడా భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు.
అధికారులు మాట్లాడుతూ.... అభివృద్ది, ఉపాధి, ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలని అన్నారు. కొందరు త్యాగం యావత్ జిల్లాలకు మంచి జరుగుతుందని చెప్పారు. దీనిపై ప్రజలు మండిపడ్డారు. పరిశ్రమలకు భూములు ఇచ్చేసి తామంతా కూలీలుగా మారాలా అంటూ అధికారులను నిలదీశారు. మంచి పటలు పండే భూములు ఎలా ఇస్తామని అధికారులను ఎదురు ప్రశ్నించారు. ఇలా భూములు ఇచ్చుకుంటూ పోతే తిండికి ఫుడ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టి కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తారా అని ఎదురు ప్రశ్నించారు. అందుకే అలాంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు రాకుండా ఉండాలి అంటే తాము భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
ఉలవపాడు మండలంలోని తీర ప్రాంతమైన కరేడు ఏరియాలో ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. దీని కోసం మార్చి 25న ఇండోసోల్‌కు భూములు కేటాయిస్తున్నట్లు జీఓ జారీ చేశారు. జూన్ 19న భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు. వైసీపీ హయాంలో కొంత భూసేకరణకు యత్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరికొంత భూమిని కేటాయిస్తూ మొత్తంగా సేకరించాలని చర్యలు చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా రైతులు గళం విప్పారు. రైతులు ఉద్యమ బాట పట్టారు. సేవ్ కరేడు పేరుతో కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు.





















