అక్కడ తల్లి, ఇక్కడ తండ్రి చనిపోతూ పిల్లల ప్రాణాలు తీశారు
కుటుంబ కలహాలు నిండు జీవితాలను బలిగొన్నాయి. నెల్లూరులో రెండు వేర్వేరు ఘటనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. అంతే కాదు తమతోపాటు బిడ్డల ఆయువు కూడా తీశారు. వినాయక చవితి పండగ మరుసటి రోజే నెల్లూరు జిల్లాలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు వేర్వేరు ఘటనలకు కారణం కుటుంబ కలహాలే కారణంగా నిండు ప్రాణాలు పోయాయి. ఒకచోట తల్లి, మరో చోట తండ్రి క్షణికావేశంలో తమ ప్రాణాలు తీసుకోవడంతోపాటు, పిల్లల ప్రాణాలు కూడా తీశారు. దీంతో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు అంబాపురం ప్రాంతంలో తండ్రి, కుమారుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. రంగస్వామి(47), శివ కుమార్(11) ఈ దుర్ఘటనలో చనిపాయారు. కుటుంబ కలహాలే ఈ జంట ఆత్మహత్యలకు కారణం అని తెలుస్తోంది. అంబాపురానికి చెందిన రంగస్వామి కొన్ని రోజులుగా భార్యతో గొడవపడుతున్నాడు. కుటుంబ కలహాలతో ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఎప్పుడూ వివాదాలే. దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడతానంటూ అప్పుడప్పుడూ హెచ్చరించేవాడు రంగస్వామి. తీరా పండగ సంబరాలు జరుగుతున్న వేళ, అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రంగస్వామికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తనతోపాటు తన ఇద్దరి పిల్లల ప్రాణాలు కూడా తీయాలనుకున్నాడు రంగస్వామి. ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని దగ్గర్లో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ముందుగా తన ఇద్దరు కొడుకులను బావిలోకి తోసేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నాడు. అయితే పెద్దబ్బాయి తండ్రి ఆలోచన తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. చిన్న పిల్లవాడు 11 ఏళ్ల శివకుమార్ ప్రాణానికి ముప్పు ఉందని గ్రహించలేకపోయాడు. బావి దగ్గరకు వెళ్లగానే ముందు శివకుమార్ ని తోసేశాడు రంగస్వామి. ఆ తర్వాత పెద్దకొడుకు పారిపోగా, తాను కూడా బావిలోకి దూకేశాడు.
తప్పించుకు పారిపోయిన పెద్ద కొడుకు ఊరిలోవారికి సమాచారమివ్వడంతో ఈ విషయం బయటపడింది. స్థానికులు హుటాహుటిన బావి వద్దకు చేరుకున్నారు, పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే రంగస్వామి,శివకుమార్ మరణించారు. శవాలను వెలికి తీసి పోస్ట్ మార్టమ్ కు పంపించారు. ఈ ఘటనపై నెల్లూరు ఫిఫ్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అక్కడ తండ్రి తనతోపాటు, కొడుకు ప్రాణం తీస్తే, రెండో దుర్ఘటనలో తల్లి తనతోపాటు ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని వింజమూరులో జరిగింది. వింజమూరు పట్టణంలోని జై భీమ్ నగర్ లో వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సాదం వెంకట్రావు, గీత భార్యా భర్త. వీరికి ఓ కుమారుడు వెంకట్(10), కుమార్తె చరిష్మా(5) ఉన్నారు. సాదం వెంకట్రావు గ్యాస్ గోడౌన్ లో గుమస్తాగా పని చేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చే సరికి భార్య, పిల్లలు ఉరేసుకుని చనిపోయి ఉన్నారని వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు పిల్లలతో కలసి తాను కూడా ఉరేసుకుని తనువు చాలించింది గీత. ఈ ఘటనతో ఒక్కసారిగా వింజమూరులో అలజడి చెలరేగింది. ఇక్కడ కూడా కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణం అని తెలుస్తోంది.
కుటుంబ కలహాలతో తమకు తాము ఆత్మ హత్య చేసుకుని చనిపోవాలనుకున్న తల్లిదండ్రులు... ఇలా పిల్లల్ని కూడా చంపేయడం మరింత దారుణం. అక్కడ తండ్రి తన కొడుకుని చంపేయగా, ఇక్కడ తల్లి తన ఇద్దరు పిల్లలను పొట్టనపెట్టుకుంది. ఒకేరోజు రెండు చోట్ల ఒకేరకమైన సంఘటనలు నెల్లూరు జిల్లాలో జరిగాయి.