Kakani Satires on Chandrababu: జనాలు బాది వదిలినా చంద్రబాబుకి సిగ్గు రాలేదు - మంత్రి కాకాణి ఘాటు వ్యాఖ్యలు
వైనాట్ 175 అనే నినాదంతో జనంలోకి వెళ్తున్నామని, కచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు కాకాణి.
జనాలు బాది వదిలిపెట్టినా మాజీ సీఎం చంద్రబాబుకి సిగ్గు రాలేదని, అయినా తిరిగి బాదుడే బాదుడు కార్యక్రమం మొదలుపెట్టారని సెటైర్లు వేశారు ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వద్దని, చంద్రబాబుకి ఓటు వేసేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సభల్లో ఖాళీ కుర్చీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. ఏడు లక్షలమంది సైనికులతో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం రూపొందించామని, కోటి ఇళ్ల లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నామని, ఆ సంతోష సమయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గృహసారథులు, కన్వీనర్లకు శుభాకాంక్షలు చెబుతున్నామని అన్నారు కాకాణి. వైనాట్ 175 అనే నినాదంతో జనంలోకి వెళ్తున్నామని, కచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు కాకాణి.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అందుకే ప్రజల నుంచి వైసీపీ పాలనకు ప్రశంసలు లభిస్తున్నాయన్నారు మంత్రి కాకాణి. మా నమ్మకం నువ్వే జగన్.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎక్కడా అసంతృప్తి కనిపించడంలేదన్నారు. దాదాపు 80శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. మెగా పీపుల్స్ సర్వేకి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు కాకాణి. కోటీ 60 లక్షల టార్గెట్ లో ఇప్పటికే కోటి కుటుంబాలను పార్టీ శ్రేణులు కలిశాయన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారిని పలకరించామని, అందరూ కలిసి కట్టుగా పని చేశామని, నెల్లూరు జిల్లాలో విజయవంతంగా ఈ కార్యక్రమం అమలవుతోందని చెప్పారు కాకాణి. ప్రభుత్వం తరపున గడప గడపకు కార్యక్రమం కొనసాగుతోందని, పార్టీ తరపున మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరుగుతోందని వివరించారు కాకాణి.
ప్రభుత్వం, ప్రజల మధ్యలో ఎవరి జోక్యం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు మంత్రి కాకాణి. అర్హత కలిగిన వారికి సచివాలయం ద్వారా పథకాలు ఇస్తున్నామని, సీఎం జగన్ వల్ల మంచి కలిగిందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ప్రజల్లో స్పందన చూసి టీడీపీ నేతలకు నిద్ర రావడం లేదన్నారు. కొన్ని మీడియా సంస్థలను అడ్డు పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాకాణి. టీడీపీ కార్యకర్తలు.. ఆ పార్టీ సానుభూతి పరులు కూడా ప్రభుత్వ పథకాలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఏడాది నుంచి ధైర్యంగా ఇంటింటికీ వెళుతున్నామని, ఈ మధ్యలో చంద్రబాబు బాదుడే బాదుడనే కార్యక్రమం మొదలు పెట్టి అభాసుపాలయ్యారని, ఇప్పుడు ఇదేం ఖర్మ అంటున్నారని చెప్పారు.
పార్టీలకు అతీతంగా పథకాలు అందరికీ వర్తించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇకనైనా విమర్శలు మానుకోవాలని చెప్పారు కాకాణి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలన్నారు. ఒకవేళ తాము తప్పులు చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని, తప్పులు దిద్దుకుంటామని, విలువైన సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. అంతేకానీ, జగన్ ను ప్రజల నుంచి ఏ విధంగా దూరం చేయాలని కుటిల పన్నాగాలు పన్నితే వచ్చే ఎన్నికల్లో మరింత గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మేలు చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.