New Ministers From Nellore: నెల్లూరు జిల్లాలో కొత్త మంత్రులెవరు? వీరికి ఛాన్స్ దక్కేనా!
Nellore: ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు మహూర్తం దగ్గరపడింది. ఉగాదినాటికి జగన్ టీమ్-2 కొలువుదీరే అవకాశాలున్నాయి. నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటి? కొత్తగా ఎవరికి అవకాశాలు రాబోతున్నాయి?
AP Cabinet Reshuffle 2022: ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు మహూర్తం దగ్గరపడింది. ఉగాదినాటికి కొత్త మంత్రులతో జగన్ టీమ్-2 కొలువుదీరే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటి..? కొత్తగా ఎవరికి అవకాశాలు రాబోతున్నాయి, ఎవరిని జగన్ తన టీమ్ లోకి తీసుకోబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది.
నెల్లూరు జిల్లాకు మొదట రెండు పదవులిచ్చారు సీఎం జగన్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు, మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు-ఐటీశాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల మేకపాటి అకాల మరణంతో ప్రస్తుతం జిల్లాకు ఒకే పోర్ట్ ఫోలియో ఉంది. పునర్ వ్యవస్థీకరణలో ఆ సీటు మారే అవకాశముంది. మరి కొత్తమంత్రులెవరు, ఎవరెవరి అంచనాలు ఎలా ఉన్నాయి..?
నెల్లూరు జిల్లానుంచి ఇద్దరు మాజీ మంత్రులున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో మంత్రులుగా పనిచేశారు. వారికి రెండోసారి అమాత్యయోగం ఉందా అంటే అనుమానమేనంటున్నారు. ఇటీవల జిల్లాల పునర్విభజన సమయంలో ఆనం తిరుగుబాటు జెండా ఎగరేశారు, ప్రభుత్వంలో ఉండి కూడా నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన కాస్త వెనక్కి తగ్గినా.. ఇప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఆనంకు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇక నల్లపురెడ్డి ప్రసన్న ఇటీవల పలు సంచలన వ్యాఖ్యలతో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. తొలి దఫాలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు, మరి రెండో దఫా అయినా జగన్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.
కాకాణికి ఖాయమేనా..?
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కాకాణి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. గౌతమ్ రెడ్డి స్థానంలో ఓసీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. ఇక నెల్లూరు రూలల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు కూడా చివరి నిముషంలో తెరపైకి వచ్చింది. మరి జగన్ మనసులో ఎవరికి స్థానముందో తేలాల్సి ఉంది.
బీసీ కోటాలో ఎవరు..?
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలంటే మాత్రం జిల్లాకు ఆ ఛాన్స్ మిస్సయ్యే అవకాశముంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు బాలాజీ జిల్లాలోకి వెళ్తున్నారు. వారిద్దరిలో ఒకరికి మంత్రి అయ్యో ఛాన్స్ ఉందని అంటున్నారు.
మొత్తమ్మీద నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకూ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు బలంగా వినపడుతోంది. ఆయనతోపాటు మరొకరికి అవకాశం ఉన్నా.. సామాజిక సమీకరణాల్లో అది జిల్లాకు మిస్ అవుతుందనే అంచనాలున్నాయి. కాకాణితోపాటు మరొకరికి అవకాశమిచ్చినా, కాకాణి కాకుండా ఇంకెవరికైనా అవకాశమిచ్చినా అది సంచలనమే అవుతుంది.