Nellore Viral Video: మాస్క్ పెట్టుకోలేదని యువకుడిపై రెచ్చిపోయిన మర్రిపాడు ఎస్సై, వీడియో వైరల్
Nellore Viral Video: నెల్లూరు జిల్లా మర్రిపాడులో మాస్క్ పెట్టుకోలేదని ఓ యువకుడిపై ఎస్సై విశ్వరూపం చూపారు. నడిరోడ్డుపై మెడబట్టి లాక్కెళ్లి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ఎస్పీ వరకూ వెళ్లింది.
Nellore Viral Video: నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఎస్సై(SI) వెంకట రమణ రెచ్చిపోయారు. స్కూటర్ పై వెళ్తోన్న ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోలేదన్న కారణంగా నడిరోడ్డుపై మెడబట్టి లాక్కెళ్లారు. ఈ సంఘటన సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది. ఎస్సై వెంకట రమణ దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు వాపోతున్నారు. అదే సమయంలో సదరు వ్యక్తి పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని, మహిళా పోలీస్ కానిస్టేబుల్ ని కూడా దుర్భాషలాడాడనే వార్తలొచ్చాయి. దీనిపై ఆత్మకూరు డీఎస్పీ(DSP) ఆధ్వర్యంలో శాఖాపరమైన విచారణ జరిపించారు జిల్లా ఎస్పీ విజయరావు(SP Vijayarao). ఎస్సై వెంకట రమణ దురుసుగా ప్రవర్తించాడని తేలడంతో అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. తీవ్రంగా మందలించి ఛార్జ్ మెమో జారీ చేశారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సంయమనంతో విధులు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు ఎస్పీ.
వాహన తనిఖీల్లో యువకుడికి జరిమానా
మర్రిపాడులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఓ యువకుడు మాస్క్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా స్కూటీపై ప్రయాణిస్తున్నాడు. దీంతో పోలీసులు యువకుడిని ఆపి జరిమానా విధించారు. అయితే ఆ జరిమానాను కట్టేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో మర్రిపాడు ఎస్సై వెంకట రమణ రెచ్చిపోయారు. యువకుడిని చొక్కా పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్సై వెంకటరమణ ఎక్కడ పనిచేసినా పనితీరు వివాదాస్పందంగానే ఉంటోందని పలువురు ఆరోపిస్తారు.
యూనిఫామ్ కొలతల ఇష్యూ
నెల్లూరు పోలీసులపై ఇటీవల కాలంలో విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మహిళా పోలీసులకు యూనిఫామ్ కొలతలను మగవాళ్లతో తీయించారని విమర్శలు వచ్చాయి. ఈ ఘటన సంచలనమైంది. స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగి వివరణ ఇచ్చే వరకూ వెళ్లింది. నెల్లూరు మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతలు తీసేందుకు పురుషులను వినియోగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పురుషులను అసలు వినియోగించలేదని, కేవలం కొలతలు నోట్ చేసుకోడానికి మాత్రమే దర్జీలు వచ్చారని ఎస్పీ విజయరావు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై మహిళా పోలీసులతో కలిసి ఏఎస్పీ వెంకట రత్నమ్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పే క్రమంలో పురుషులు వారికి సూచనలు ఇచ్చారని అన్నారు. ఈ సున్నితమైన వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. కొలతలు తీసే క్రమంలో లోపలికి వచ్చి ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా పోలీసులు కోరుతున్నారని ఆమె చెప్పారు. ఫోటోలు తీయడానికి అనుమతి లేకుండా లోపలికి రావడం సరికాదని, వాటిని వైరల్ చేయడం సరికాదని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.