Nara Lokesh: సౌదీ అరేబియాలో మరో తెలుగు వ్యక్తి దీన స్థితి - స్పందించిన మంత్రి లోకేశ్, స్వస్థలానికి తీసుకొస్తామని భరోసా
Andhrapradesh News: సౌదీ అరేబియాలో చిక్కుకున్న మరో వ్యక్తి తన దీన స్థితిని వీడియోలో వివరిస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ బాధితునికి భరోసా ఇచ్చారు.
Minister Nara Lokesh Bharosa To Telugu Victim In Saudi Arebia: ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఎంతోమంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడును సోషల్ మీడియా వేదికగా వెల్లబోసుకుంటున్నారు. తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరెల్ల వీరేంద్రకుమార్ అనే తెలుగు వ్యక్తి వీడియో ద్వారా తన దీన స్థితిని వివరించాడు. ఖతర్‌లో (Qatar) ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సౌదీ అరేబియా (Saudi Arebia) తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెల 10న ఖతర్ వెళ్లానని.. అక్కడి నుంచి 11వ తేదీన సౌదీ అరేబియా తీసుకెళ్లి ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారని.. ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నట్లు వాపోయాడు. తనకు రక్త వాంతులు అవుతున్నాయని.. చనిపోయేలా ఉన్నానంటూ చెప్పాడు. తనను కాపాడాలని వేడుకున్నాడు. ఈ వీడియోను ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశాడు.
స్పందించిన మంత్రి లోకేశ్
ఈ వీడియో చూసిన మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందింస్తూ బాధితునికి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని.. స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
Veerendra, we will bring you back home safely! Don't worry! https://t.co/GKk9j4n64R
— Lokesh Nara (@naralokesh) July 19, 2024
కువైట్ బాధితున్ని రక్షించిన లోకేశ్
కాగా, ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్‌లో చిక్కుకున్న అక్కడ అష్టకష్టాలు పడ్డ బాధితున్ని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రక్షించారు. అన్నమయ్య (Annamayya) జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ (Siva) ఏజెంట్ సాయంతో కువైట్ వెళ్లాడు. అక్కడ ఎడారిలో జన సంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతులు మేపే పనిలో ఆయన్ను పెట్టారు. సరిపడా ఆహారం, నీరు లేక.. ఎండలు, ఇసుక తుపానులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లకుంటే ఆత్మహత్యే శరణ్యమంటూ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ టీడీపీ ఎన్నారై విభాగం ప్రతినిధులకు బాధితుని వివరాలు పంపించారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించి.. కువైట్‌లోని భారత ఎంబసీ సాయంతో బాధితుడు స్వదేశానికి వచ్చేలా చర్యలు చేపట్టారు.
ఈ నెల 17న బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బాధితుడు శివ అక్కడి నుంచి స్వగ్రామం చింతపర్తికి చేరుకున్నాడు. భార్య, కుమార్తెలను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. తాను స్వగ్రామానికి చేరుకోవడానికి సహకరించిన మంత్రి లోకేశ్, పీలేరు ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డిలకు శివ, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Siva is safely lodged at the Indian embassy in Kuwait. He will be brought back to Andhra Pradesh soon. pic.twitter.com/qT4poqNHJj
— Lokesh Nara (@naralokesh) July 15, 2024