CM Jagan: సెవెన్ స్టార్ హోటల్స్‌కి సీఎం శంకుస్థాపన, జగన్ అంటే కొత్త అర్థం చెప్పిన మంత్రి రోజా
జమ్మలమడుగు మండలం గండికోట వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఒబెరాయ్ హోటల్ నిర్మాణం కోసం సీఎం జగన్ భూమి పూజ చేశారు.
వైఎస్‌ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెవెన్ స్టార్ హోటళ్లకి శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు మండలం గండికోట వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఒబెరాయ్ హోటల్ నిర్మాణం కోసం సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్‌సింగ్ ఒబెరాయ్, ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి పెద్ద పెద్ద హోటల్ గ్రూప్ రావడం వల్ల గండికోటను గ్లోబల్ టూరిజం మ్యాప్ లోకి తీసుకుపోగలమని అన్నారు. తిరుపతి, విశాఖపట్నంలో కూడా ఇలాంటి హోటల్ వస్తుందని అన్నారు. ఈ హోటల్ వల్ల కడప జిల్లాతో పాటు గండికోట ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకుంటామని చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోనే స్టీల్ ఫ్యాక్టరీ రాబోతోందని చెప్పారు. గత ఏడాది దీనికి సంబంధించి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. స్టీల్ ప్రాజెక్టుకు ఈ జూలై 15కు పర్యావరణ అనుమతులు వచ్చేస్తాయని చెప్పారు. ఆ వెంటనే పనులు వేగంగా జరుగుతాయని వివరించారు.
ఒబెరాయ్ హోటల్స్ గండికోటకు రావడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. కనీసం 500 నుంచి 800 మంది వరకూ ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ గండికోటలోనే ఇంకా ఇలాంటి ప్రాజెక్టులే మరిన్ని వస్తాయని చెప్పారు. కొప్పర్తి డిక్సన్ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు ఎంవోయూలు చేసుకుంటామని, గండికోటలో గోల్ఫ్ కోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఒబెరాయ్‌ని కోరానని చెప్పారు.
JAGAN కి కొత్త అర్థం చెప్పిన మంత్రి రోజా
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తున్నారని, ఏపీలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రికార్డులు సృష్లించాలన్నా.. బద్ధలుగొట్టాలన్నా సీఎం జగన్‌కే సాధ్యం అంటూ మాట్లాడారు. జగన్ అంటే జస్టిస్, అష్యూరెన్స్, గుడ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, నో కాంప్రమైజ్ అని ఆకాశానికెత్తేశారు.
కొత్త అధ్యాయానికి శ్రీకారం - సీఎస్
సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. గండికోట చారిత్రాత్మక ప్రదేశం అని అన్నారు. పర్యాటక రంగంలో కొత్త అధ్యాయానికి సీఎం శ్రీకారం చుట్టారని, పోలవరం ప్రాంతాల్లో కూడా పర్యాటక అభివృద్ధి జరుగుతూ ఉందని అన్నారు. గండికోట దేశంలోనే గొప్ప పర్యటక కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో మూడు చోట్ల సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణాన్ని ఒబెరాయ్ సంస్థ చేపట్టనుంది. గండికోటతో పాటు తిరుపతి, విశాఖపట్నాల్లో వీటిని నిర్మించనున్నారు. ఆ హోటళ్లను కూడా ఇక్కడి నుంచే సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.
తర్వాత పులివెందులలో కొత్తగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. పులివెందుల రాణితోపు చేరుకొని నగరవనాన్ని ప్రారంభించారు.