Forbes List : ఫోర్బ్స్ జాబితాలో కోనసీమ కుర్రాడు, క్యాన్సర్ గుర్తింపు ప్రాజెక్టుతో యంగ్ అచీవర్స్ లిస్ట్ లో స్థానం
Forbes List : ఫోర్బ్స్ ప్రకటించే అత్యంత ప్రతిభావంతుల జాబితాలో తెలుగు యువకుడికి స్థానం లభించింది. కోనసీమ కుర్రాడు యంగ్ అచీవర్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.
Forbes List : ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో జన్మించినా ఏదైనా సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే ఎంతటి స్థాయికైనా చేరుకోవచ్చని ఎంతో మంది నిరూపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి దేశం గర్వించదగ్గ నాయకులుగా, సైంటిస్ట్‌లగా, ఆవిష్కరణకర్తలుగాను ఎంతో మంది మహానుభావులు పేరు ప్రఖ్యాతులు సాధించారు. మన నేపథ్యం ఎక్కడ, ఏమిటి అన్నది కాదు కానీ మనం ఏం సాధించామన్నది ముఖ్యమని గుర్తెరగాలని అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రవేత్తలు చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. అలాంటి ఘనతే సాధించాడు ద్రాక్షారామానికి చెందిన యువకుడు. ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత ప్రతిభావంతుల జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే అది ఆ గౌరవం పొందిన వ్యక్తికే కాదు తాను పుట్టిన ప్రాంతానికి కూడా గర్వకారణమే. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామానికి చెందిన ఓ యువకుడు తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన యంగ్ అచీవర్స్ 30 మంది జాబితాలో చోటుదక్కించుకున్నాడు.
రొమ్ము క్యాన్సర్ గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు
కాకిలేటి సూరిబాబు కుమారుడు కాకిలేటి శివతేజ రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్ట్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ఐఐటీ గుహవాటిలో ఈసీఈతో పాటు సీఎస్‌ఈ మైనర్ డిగ్రీ ఏకకాలంలో పూర్తి చేసిన శివతేజ బెంగుళూరులోని నిరమయ్ హెల్త్ ఎనలిటిక్స్ అనే మెడికల్ సాప్ట్‌వేర్ కంపెనీను మరికొంతమంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్ ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ సంస్థకు శివతేజ డైరెక్టర్, రీసెర్చ్ ప్రిన్సిపాల్, డేటా సైంటిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు నెదర్లాండ్స్‌లో మాస్ట్రక్ట్ విశ్వవిద్యాలయంలో క్లీనికల్ డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. శివతేజ ఈ విభాగంలో ఇప్పటికే 25కు పైగా అంతర్జాతీయ రచనలు చేయగా వాటిలో 23కు పైగా పేటెంట్ హక్కులు లభించాయి. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుకు సంబంధించి మెషీన్ లెర్నింగ్ బృందానికి శివతేజ టీమ్‌లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. మెడికల్ ఇమేజింగ్‌లో మంచి అనుభవం సాధించిన శివతేజ పరిశోధనలకు మంచి గుర్తింపు లభించడంతో తాజాగా ఫోర్బ్స్ పత్రిక యంగ్ అచీవర్స్ జాబితాలో స్థానం కల్పించింది. దీంతో శివతేజ స్వగ్రామం ద్రాక్షారామలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా తల్లిదండ్రులను స్థానికులు అభినందిస్తున్నారు.