Sankurathri Chandra Sekhar : 30 ఏళ్లలో మూడు లక్షల 25 వేల మందికి కంటి ఆపరేషన్లు, సేవారంగంలో సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మ శ్రీ
Sankurathri Chandra Sekhar : కుటుంబం మొత్తం విమాన ప్రమాదంలో చనిపోయినా ఆవేదనతో కుంగిపోలేదు. సేవమార్గంలో నడుస్తూ పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారు సంకురాత్రి ఫౌండేషన్ చంద్రశేఖర్.
Sankurathri Chandra Sekhar : మూడు దశాబ్దాల సేవా చరిత్ర ఆయనది. గడిచిన 30 ఏళ్లలో లక్షలాది మందికి చూపునిచ్చిన సంకల్పం. గ్రామీణ విద్యార్థుల కోసం విద్య, నిరుపేదల నేత్రాల్లో చీకటిని తొలగించేందుకు ఉచిత నేత్ర వైద్యం అందించేందుకు నడుంకట్టారు. కుటుంబం అంతా విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఆ ఆవేదన లోనుంచే చారిత్రక సేవా దృక్పథం పుట్టుకురాగా కాకినాడ కేంద్రంగా తన ఇంటిపేరునే సేవాసంస్థగా స్థాపించి మూడు దశాబ్ధాల కాలంగా సేవా రంగంలో తరిస్తున్నారు. ఆయనే సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, శారద విద్యాసంస్థలు, కిరణ్ నేత్రాలయ సంస్థల అధినేత చంద్రశేఖర్. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించబోతోంది.
విమాన ప్రమాదంలో భార్య, పిల్లలు మృతి
1985 జూన్ 23న ఐర్లాండ్ తీరంలో ఎయిర్ ఇండియా విమానంపై జరిగిన బాంబు దాడిలో చంద్రశేఖర్ సతీమణి మంజరి, కుమారుడు కిరణ్, కుమార్తె శారదలు దుర్మరణం పాలయ్యారు. అప్పటికి చంద్రశేఖర్ కెనడాలోని ఒట్టవాలోని ఆరోగ్య మంత్రిత్వశాఖకు సైంటిఫిక్ ఎవాల్యుయేటర్‌గా, కెనడాలోని ఫిషరీస్ మంత్రిత్వశాఖకు విజిటింగ్ సైంటిస్ట్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి కెనడాలో ఉండేవారు. భార్య, కుమారుడు, కుమార్తెను కోల్పోయిన చంద్రశేఖర్ సంకురాత్రి 1989లో తన ఇంటిపేరు మీదే సంకురాత్రి ఫౌండేషన్‌ను స్థాపించారు. కుమార్తె పేరుపై 1992లో శారదా విద్యాలయాలను స్థాపించి, కుమారుని పేరు మీద 1993లో కిరణ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీను స్థాపించారు. చంద్రశేఖర్ స్థాపించిన కిరణ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీ దాని అనుబంధ సంస్థల ద్వారా ఇప్పటివరకు 3 లక్షల 25 వేల మందికి పైగా నేత్ర శస్త్ర చికిత్సల ద్వారా దృష్టి పునరుద్ధరించారు. శారదా విద్యాలయాల ద్వారా వేలాది మంది గ్రామీణ విద్యార్థులు ఉచిత విద్యను అందించారు.
ఎన్నో అవార్డులు
కాకినాడ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంకురాత్రి ఫౌండేషన్ సేవలను గుర్తించిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు అనేక అవార్డులు, ప్రశంసలతో చంద్రశేఖర్‌ను సత్కరించాయి. ఉభయగోదావరి జిల్లాల్లో నేత్ర సంబంధిత ఇబ్బందులు తలెత్తితే ముందుగా గుర్తుకు వచ్చేది కిరణ్ కంటి ఆసుపత్రే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సొంతం చేసుకున్న చంద్రశేఖర్ సంకురాత్రి సేవలకు ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వం దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారంతో సత్కరించనుంది.
నాతో కష్టపడ్డవారందరికీ ఈ అవార్డు అంకితం
చాలా సాదాసీదాగా కనిపించే సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడంపై ఆయన స్పందించారు. తనతోపాటు కష్టపడ్డవారందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై గర్వపడడం లేదని, తానే చేసిన పనికి గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వారిని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఫౌండేషన్ స్థాపించానని, అందరికీ నాణ్యమైన చూపు అందించాలని, అదే విధంగా గ్రామీణ పిల్లలకు విద్యను అందించాలని తన సంకల్పమన్నారు. గడిచిన 30 ఏళ్లలో మూడు లక్షల 25 వేల మందికి కంటి ఆపరేషన్లు చేయించామని, అందులో 90 శాతం మందికి డబ్బులు తీసుకోలేదని వెల్లడించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు చంద్రశేఖర్.